రాష్ట్రంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలపై గురిపెట్టిన అధికార తెరాస... అందుకనుగుణంగా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అధిష్ఠానం ఆదేశాలతో... నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంత్రులు, శాసనసభ్యులు... ఇతర ప్రజా ప్రతినిధులు... నియోజకవర్గాల వారీగా సమావేశాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ ఇదివరకే... మొత్తం ఆరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం అయ్యారు. రెండు నియోజకవర్గాల్లోనూ పెద్దఎత్తున పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని.... ఆదేశించారు. వరంగల్ అర్బన్ నియోజకవర్గాల్లో జరిగిన సన్నాహక సమావేశాల్లో... మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిధుల పరంగా కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని వరంగల్‌లో భాజపాపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ధ్వజమెత్తారు.
విజయ పరంపర కొనసాగించేందుకు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ... తెరాస విజయ పరంపర కొనసాగించేందుకు తెరాస శ్రేణులు సమాయత్తం కావాలని మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. ఎన్నిక ఏదైనా తెరాసదే విజయమని, రాబోయే ఎన్నికల్లోనూ తెరాస అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, మధిర నియోజకవర్గాల స్థాయి కార్యకర్తలతో మంత్రి సమావేశం
నిర్వహించారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయి ముఖ్య నాయకులకు ఎన్నికలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని.... కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విజయం సాధించే దిశగా...
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు మండలి ఎన్నికలలో విజయం సాధించే దిశగా కృషి చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూరు పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకూడదని ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన నాయకులతో జూమ్ ఆప్ ద్వారా సమావేశమైన మానిక్కం ఠాగూర్ పలు అంశాలపై చర్చించారు.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని పలువురు నాయకులు రాష్ట్ర ఇంఛార్జి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉన్న దృష్ట్యా... తనకు ప్రమాదం పొంచి ఉందని... ప్రచారం పూర్తయ్యే వరకు తనకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత రావు... డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిన ఆయన... తన ప్రత్యర్ధుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: జలసిరులతో ప్రాజెక్టుల తొణికిసలు... నదుల పరవళ్లు...