ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీలో జరిగే కొన్ని కీలక ఒప్పందాల్లో భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని అఖిల భారత రైతాంగ పోరాట సమన్నయ సమితి(ఏసీకేఎస్‌సీసీ) పేర్కొంది. ట్రంప్ భారత్ పర్యటనను నిరసిస్తూ.. ఈ నెల 24, 25 తేదీల్లో తెలంగాణవ్యాప్తంగా అన్ని గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువజనలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్‌కుమార్ సూచించారు. హైదరాబాద్ విద్యానగర్ సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేఎస్‌సీసీ అనుబంధ రైతు సంఘాల నేతలు వెల్లడించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం
అమెరికా - భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా కోట్ల రూపాయల విలువ చేసే మినీ వాణిజ్య ఒప్పందం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై సంతకాలు చేయనున్నారని సంఘం నేతలు వెల్లడించారు. ఈ ఒప్పందాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పెను ప్రమాదం ఉన్నందున వ్యవసాయం, అనుబంధ రంగాలను మినహాయించడం సహా భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించి కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: యుద్ధ మేఘాల నుంచి స్నేహగీతాల వరకు...