రాష్ట్రం వ్యవసాయ, పాడి రంగాల్లో వృద్ధి చెందిందని.. పరిశోధనలు పెరిగాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ వంగాల లక్ష్మారెడ్డి అన్నారు. పశువుల్లో లంపీస్కిన్, బ్యూటంగ్ వ్యాధులు గుర్తించామని.. దీని వల్ల రైతులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యవసాయ, పాడి గురించి ఐసీఏఆర్ డీజీ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్రకు వివరించారు. ఇప్పటికే... ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో లంపీస్కిన్ వ్యాధి కనిపిస్తున్న దృష్ట్యా... నివారణ కోసం టీకా ఆవిష్కరణపై పరిశోధనలు జరగాల్సి ఉందని డీజీ అభిప్రాయపడ్డారు. ఇది జన్యుపరంగా సంక్రమించే వ్యాధి కానుందున మనుషులకు సోకే అవకాశం లేదని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు.
లంపీస్కిన్ అనే వ్యాధి పూర్తిగా చర్మ వ్యాధి అని... చర్మం, గంగడోలు, మూతిపైన గుండ్రపు ఆకారంలో దద్దులు ఏర్పడి పుండుగా మారి.. రక్తస్రావం అధికంగా ఉంటుందని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా నివారించవచ్చని సూచించారు. ఈ వ్యాధి నల్లజాతి పశువుల్లో రాదు. కేవలం తెల్లజాతి పశువుల్లో మాత్రమే వస్తుందని స్పష్టం చేశారు. సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో కూడా అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. ఇటీవల పశువులకు 6 లక్షల రోగ నిరోధక డోసులు ఇచ్చామన్నారు. ఆ క్రిమి ఉండటం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం కొంత ఉంటుందన్నారు. పునరుత్పత్తిపై ప్రభావం ఉండదని తెలిపారు. పశుసంవర్థక శాఖ వైద్యులు, సిబ్బంది, గోపాలమిత్రులు క్రిమిని కొంతవరకు అదుపులోకి తీసుకురాగలిగారని డైరెక్టర్ తెలిపారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ సంస్థలే రైతుల వద్దకు వస్తాయి: కేసీఆర్