రాష్ట్రంలో రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద నాలుగో రోజూ నల్గొండకే అత్యధికంగా 53,381 మంది రైతులకు 1,82,542 ఎకరాలకు గాను 91.27 కోట్ల రూపాయలు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ మూడు రోజుల్లో 42 లక్షల 43వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం 58.85 లక్షల ఎకరాలకుగాను 2,942 కోట్ల రూపాయలు జమయ్యాయని పేర్కొన్నారు. రేపు 7 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,153 కోట్ల రూపాయలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2300 మంది రైతులకు గాను 7212 ఎకరాలకు 36.05 లక్షల రూపాయలు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.
మొత్తం 4 రోజుల్లో రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 4095.77 కోట్ల రూపాయలు నిధులు జమ అవుతాయని ఆయన ప్రకటించారు. కరోనా విపత్తులోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయ రంగమేనని మంత్రి కొనియాడారు. ఇప్పటికీ 60 శాతం మంది ప్రత్యక్ష్యంగా... మరో 20 శాతం మంది పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగం బాగుండాలన్న ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి చేయూత నిస్తున్నారని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ సరఫరాతో పాటు 100 శాతం పంటల కొనుగోళ్ల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నారని వివరించారు. అందుకే కరోనా విపత్తులో సైతం గత వానా కాలం, మొన్న యాసంగి సీజన్లలో కలిపి మొత్తం 14656.02 కోట్ల రూపాయలు, ప్రస్తుత వానా కాలంలో 7508.78 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు. అన్నదాతల విశాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు వల్ల తెలంగాణలో సాగు దశ - దిశ మారిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.