రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్) సీజన్ పనులు మొదలయ్యాయి. ప్రభుత్వపరంగా సాగు సన్నాహాలను పర్యవేక్షించాల్సిన కీలక అధికారుల పోస్టుల్లో ఇన్‌ఛార్జులు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయ కమిషనర్ పోస్టు 13 నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్‌ఛార్జి అధికారితోనే నెట్టుకొస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాల్సిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (టీఎస్ సీడ్స్), హాకా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) పోస్టుల్లోనూ ఏడాదిన్నరగా ఇన్‌ఛార్జులే కొనసాగుతున్నారు. రాష్ట్రంలో నాసిరకం లేదా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయించి, వారి లైసెన్సులను రద్దు చేసే అధికారాలు కమిషనర్‌కే ఉన్నాయి. ఇన్‌ఛార్జి కావటం, పైగా మూడు పోస్టులు నిర్వహిస్తుండటంతో వ్యవసాయ శాఖకు ఏమేరకు న్యాయం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
గత 13 నెలలుగా వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా, ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన జనార్దన్‌రెడ్డి స్థానంలో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది తప్ప శాశ్వత అధికారిని నియమించలేదు. 18 జిల్లాల వ్యవసాయాధికారుల పోస్టుల్లో కిందిస్థాయి ఉద్యోగులే ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, సంయుక్త సంచాలకులు, డీఏవోలు.. ఇలా అన్ని స్థాయుల్లో ఎక్కువ శాతం ఇన్‌ఛార్జులే ఉన్నారు. రాజేంద్రనగర్ ప్రయోగశాలలో పనిచేసే డీడీని, ములుగు, సూర్యాపేట డీఏవోలను కమిషనరేటులో ఇన్‌ఛార్జి డీడీలుగా నియమించారు.
ఇదీ చదవండి: Crop loans: రుణమాఫీ అమలులో జాప్యం.. పెట్టుబడి సాయానికి బ్యాంకుల ఎసరు.!