తెలంగాణ ఏర్పడిన మొదట్లో రాష్ట్రంలో 19.03 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండేవి. ఇప్పుడా సంఖ్య 25.56 లక్షలకు చేరింది. ఈ లెక్కన ఏడేళ్లలో 6.53 లక్షల అదనంగా కొత్త కనెక్షన్లు ఇచ్చారు. కొత్త కనెక్షన్ల కోసం మరో లక్షకుపైగా రైతుల దరఖాస్తులు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల వద్ద పెండింగులో ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు మరో 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగం 58 వేల మిలియన్ యూనిట్ల (ఎంయూ)కు పైగా ఉంది. రోజు వారీగా గరిష్ఠ వినియోగం 283 ఎంయూలు ఉంది. భారీ వర్షాల సమయంలో మోటార్లు నడవకపోతే డిమాండు తగ్గుతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో విద్యుత్ డిమాండు 8 వేల మెగావాట్లకన్నా తగ్గింది. గత మార్చి చివరి వారంలో యాసంగి పంటలకు వ్యవసాయ బోర్లను ఎక్కువగా వాడటం వల్ల రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా మార్చి 26న 13,688 మెగావాట్ల విద్యుత్ డిమాండు నమోదైంది. 2021, ఏప్రిల్ 3న రాష్ట్రంలో అన్ని వర్గాలకు కలిపి 283 ఎంయూల వినియోగమైంది. ఇందులో 100 ఎంయూలకు పైగా వ్యవసాయానికే వినియోగించినట్లు అంచనా. పంటల సాగు విస్తీర్ణం పెరగడం, కాళేశ్వరం సహా ఇతర ఎత్తిపోతల పథకాల మోటార్లను నడుపుతున్నందున వ్యవసాయ విద్యుత్ వాడకం మరింత పెరిగింది.
దక్షిణ తెలంగాణలో పెరిగిన కనెక్షన్లు
రాష్ట్రం ఏర్పడక ముందు ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో 9.87 లక్షల వరకు వ్యవసాయ బోరు కనెక్షన్లు ఉంటే.. హైదరాబాద్ కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 9.16లక్షలే ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ డిస్కంలో 12.19లక్షల కనెక్షన్లు ఉండగా.. దక్షిణ డిస్కంలో 13.37 లక్షలకు చేరాయి.
40 శాతం వరకు వ్యవసాయానికే..
రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 40 శాతం వరకూ వ్యవసాయనికే ఉంటోంది. తమ అంచనా ప్రకారం 30 లక్షల బోర్లకు ఇప్పటికే ఉచిత విద్యుత్‌ను వాడుకుంటున్నారు. వాటికి కోతలు లేకుండా 24 గంటలు కరెంటును సరఫరా చేస్తున్నాం.
- ప్రభాకరరావు, సీఎండీ, ట్రాన్స్‌కో-జెన్‌కో
ఇదీ చూడండి: SARANGAPUR PUMP HOUSE: సర్జ్‌పూల్ నుంచి లీకేజీలే కారణమా? వరదొచ్చిన ప్రతిసారీ మునక తప్పదా!