కరోనా తర్వాత ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన జనం.... నగర సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో వారికి సరైన విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సామగ్రి, సాగు మెళకువలు నేర్చుకోవడానికి సరైన వేదిక దొరకడం లేదు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని అగ్రి-హార్టికల్చర్ సొసైటీ (Agri Horticulture Society) ఈ లోటు తీరుస్తోంది.
మిద్దెసాగు చేయాలనుకునేవారి కోసమే
వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు నేతృత్వంలో ఈ సొసైటీ ద్వారా సేవలందిస్తోంది. ఇకపై పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు, సదస్సుల ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులు, జంట నగరవాసులకు చేరువకావాలని నిర్ణయించింది. అరుదైన మొక్కలను తక్కువ ధరకే అందిస్తూ మిద్దెసాగు చేయాలనుకునేవారిని ప్రోత్సహిస్తామని సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. రకరకాల పండ్ల మొక్కలు, అలంకరణ మొక్కలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయంటున్నారు.
ఉత్సాహవంతులకు రైతులు తీసుకుని పండిస్తున్నారు. మిద్దేసాగుకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ద్వారా రైతులకు సలహాలు ఇస్తున్నాం.. ఇళ్లలో తోటలు పెట్టుకునే వారు.. పాట్ మిక్సర్ ఎలా తయారు చేయాలని అడుగుతుంటారు. మేమే పాట్ మిక్సర్ తయారు చేసి అమ్ముతున్నాం. కొంత మంది పురుగు తగిలిన మొక్కలను తీసుకొస్తూ ఉంటారు. వారికి సలహాలు కూడా ఇస్తున్నాం.
- డాక్టర్ ఏవీ రావు, సోసైటీ ప్రతినిధి
శిక్షణతో పాటు సాంకేతిక సహకారం
25 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన పండ్ల మొక్కల్లో అధిక శాతం ఈ అగ్రి-హార్టికల్చర్ సొసైటీ నుంచే వెళ్లేవి. మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. నాబార్డు నుంచి కోటి రూపాయల గ్రాంట్ కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు శిక్షణతో పాటు సాంకేతిక సహకారం అందించేలా కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు.
ఎన్నో న్యూ వెరైటీలు తీసుకువచ్చాం. మీకు ఏది కావాలన్నా ఇక్కడికి వస్తే దొరుకుతుంది. శిక్షణ ఫస్ట్ ఆన్లైన్లో ఇచ్చాం... ఈ అగ్రి-హార్టికల్చర్ సొసైటీకి మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నాం. నాబార్డు నుంచి కోటి రూపాయల గ్రాంట్ కోరం.
- ఎం.లక్ష్మారెడ్డి, సోసైటీ ప్రతినిధి
రాష్ట్రస్థాయి ఉద్యాన మేళా
సాగు, ఎరువుల తయారీ, వినియోగం, ఆధునిక పద్ధతులపై శిక్షణనిస్తామని చెబుతున్నారు. జనవరిలో ఉద్యాన శాఖ సమన్వయంతో పీపుల్స్ ప్లాజాలో రాష్ట్రస్థాయి ఉద్యాన మేళా నిర్వహించబోతున్నట్లు సొసైటీ నిర్వాహకులు తెలిపారు.