రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు ఉంటాయని వెల్లడించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా చేపడుతున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు: కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని గంటల వ్యవధిలోనే రాహుల్‌గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడంపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. కొన్ని కుట్రల వల్ల అనర్హత వేటుతో పదవి కోల్పోయిన రాహుల్‌కు ఇది పెద్ద సమస్య కాదన్నారు. ఎంపీ పదవి ఉన్నా.. లేకపోయినా ఆయన మాటకు, వారి కుటుంబానికి చాలా గొప్ప విలువ ఉందని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి గొప్ప విశిష్ఠత ఉందని.. ఇలాంటి సమస్యలేవీ వారి ప్రతిష్ఠను దెబ్బతీయలేవని స్పష్టం చేశారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా.. మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా చేశారని.. వేరే నాయకుల్లా పదవుల కోసం రాహుల్‌గాంధీ పాకులాడలేదని తెలిపారు.
రాహుల్ పాదయాత్ర చూసి బీజేపీకి భయం కలిగింది: రాహుల్‌గాంధీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి గొప్ప ఆదరణ లభించిందని జగ్గారెడ్డి వివరించారు. రాహుల్ పాదయాత్ర చూసి బీజేపీకి భయం కలిగిందని విమర్శించారు. అందుకే ఇలాంటి కుట్రలు చేశారని ఆరోపించారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే వారి విలువ పోయిందని దుయ్యబట్టారు. దేశంలో అదానీ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నుంచి బయటపడేందుకే.. ఈ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తామంతా రాహుల్‌గాంధీకి అండగా నిలబడతామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
"రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి గొప్ప ఆదరణ లభించింది. రాహుల్ పాదయాత్ర చూసి బీజేపీకి భయం కలిగింది. అందుకే ఇలాంటి కుట్రలు చేశారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను పొగిడినప్పుడే వారి విలువ పోయింది. దేశంలో అదానీ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు." - జగ్గారెడ్డి, ఎమ్మెల్యే
ఇవీ చదవండి: