రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పరిస్థితి ముందు నుయ్యి... వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈసారి అక్టోబరు 3న నిర్వహించనున్నారు. ఫలితాలు ఇచ్చేందుకు 7-10 రోజుల సమయం పడుతుంది. తర్వాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) ఆరు లేదా ఏడు రౌండ్ల కౌన్సెలింగ్‌కు నెల రోజులపాటు పడుతుంది. అంటే కౌన్సెలింగ్ కనీసం నవంబరు 10 వరకు జరుగుతుంది. ఆపై కూడా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ఖాళీ సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ జరుపుతారు. దానికి కనీసం మరో 10 రోజులు పడుతుంది.
అక్టోబరు 25లోపు..
గత ఏడాది నవంబరు 21కి మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తాజా ఆదేశాల ప్రకారం అక్టోబరు 25లోపు బీటెక్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభించాలి. దాన్ని అమలు చేస్తే ముందు ఇక్కడ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లు పొంది.. చివరగా ఐఐటీలు లేదా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరతారు. గత ఏడాది ఇలా జరగడం వల్లే జేఎన్‌టీయూహెచ్, ఓయూ ఇంజినీరింగ్ కళాశాలల్లో 300కి పైగా సీట్లు ఖాళీ అయ్యాయి.
స్పాట్ ప్రవేశాలు ఉండవు.
ప్రైవేట్ కళాశాలల మాదిరిగా వర్సిటీ కళాశాలల్లో స్లైడింగ్ (ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు మారడం) అవకాశం ఉండదు. స్పాట్ ప్రవేశాలు ఉండవు. ఫలితంగా సీట్లు ఖాళీగా ఉండాల్సిందే. ప్రైవేట్ కళాశాలల్లో ఖాళీ అయినా వాటిని స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేసుకుంటాయి. ఒకవేళ ఐఐటీల కౌన్సెలింగ్ పూర్తయ్యేవరకు వేచిచూస్తే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమవుతుంది. అధికారులేమో ఈసారి సీట్లు మిగిలిపోకుండా ప్రణాళిక రూపొందిస్తామని చెబుతున్నారు. ఆగస్టులో పాలిసెట్, సెప్టెంబరులో ఈసెట్, అక్టోబరులో ఎంసెట్‌లకు కౌన్సెలింగ్ జరుపుతామంటున్నారు. అయితే జోసా కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ జరపకుండా ఉంటారా అన్నది ప్రశ్న.
ఇదీ చూడండి: Medical Colleges: రేపట్నుంచి వైద్యకళాశాలలు పునఃప్రారంభం.. పాఠాలు ఆన్‌లైన్‌లోనే