Prakash Raj Reacts on TRS MLAs Buying Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం భాజపాకు అలవాటుగా మారిందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు దేశంలో అన్నిచోట్లా భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందని విమర్శించారు.
భాజపా నాయకులను ప్రకాశ్ రాజ్ దొంగలతో పోల్చారు. వారికి వేరే పని తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి రాజకీయాలు చేస్తున్న నేతలను ప్రజలు ప్రశ్నించాలని కోరిన ప్రకాశ్ రాజ్.. ప్రజల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. దేశాన్ని నడిపిస్తుంది ప్రజలే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై హర్షం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: