Actor Navdeep Attends Police Enquiry In Drugs Case : తానెప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నటుడు నవదీప్ స్పష్టం చేశారు. ఏపీలోని వైజాగ్‌కు చెందిన రామ్‌చందర్‌తో పరిచయం మాత్రమే ఉందని.. అతనితో ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తెలిపారు. హైదరాబాద్ సీసీఎస్‌లో నార్కోటిక్ అధికారుల ముందు విచారణకు హాజరైన అనంతరం బయటకు వచ్చిన నవదీప్ ఈ మేరకు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఇచ్చినందున విచారణకు వచ్చినట్లు పేర్కొన్నారు.
Madhapur Drugs Case Latest Update : డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు. గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు పిలిచి విచారించారని.. గతంలో సిట్, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారని వివరించారు. నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానాలు ఇచ్చానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారని స్పష్టం చేశారు.
నేనెప్పుడూ.. ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు. రామ్‌చందర్‌తో నాకు పరిచయం మాత్రమే ఉంది. అతనితో ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదు. డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు ఇచ్చినందున విచారణకు వచ్చాను. డ్రగ్స్ కేసులో సీపీ సీవీ ఆనంద్, ఎస్పీ సునీతా రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పని చేస్తున్నాయి. గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు పిలిచి విచారించారు. గతంలో సిట్, ఈడీ విచారించింది. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారు. నార్కోటిక్ అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానాలు ఇచ్చాను. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని చెప్పారు. - నటుడు నవదీప్
వాట్సాప్ చాటింగ్ రిట్రీవ్..: ఇదిలా ఉండగా.. నవదీప్‌ను సుమారు 6 గంటల పాటు విచారించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు.. ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్ ముందుంచి.. నవదీప్ నుంచి పలు సమాచారం రాబట్టారు. మరోవైపు.. వాట్సాప్ చాటింగ్‌ను రిట్రీవ్ చేయనున్న అధికారులు.. డాటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను విచారించే అవకాశం ఉంది.
ముందస్తు బెయిల్ కోసం పిటిషన్..: ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నవదీప్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ఈ నెల 19 వరకు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. దీంతో నవదీప్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నార్కోటిక్ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. నవదీప్‌కు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని హీరో నవదీప్‌కు సూచించింది. ఈ మేరకు నవదీప్ నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.