అవయవదానంపై అవగాహన పెంచేందుకు టాలీవుడ్ నటుడు జగపతిబాబు ముందుకొచ్చారు. తన జన్మదినం సందర్భంగా మరణానంతరం తాను అవయవదానం చేయనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. శనివారం ఆయన 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సభాముఖంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
జన్మదినం సందర్భంగా ఏదైనా పది మందికీ ఉపయోగపడే కార్యక్రమం చేయాలనుకున్నానని, అవయవదానం ప్రతిజ్ఞ అయితే మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని జగపతి బాబు అన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, కాలేయం, కళ్లు, చర్మం, చేతులు.. ఇలా ఎన్నో రకాల అవయవాలను మరణానంతరం వేరేవారికి అమరిస్తే వాళ్లకు కొత్త జీవితం లభిస్తుందని ఆయన అన్నారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకురావాలని పిలుపునిచ్చారు.
తమకు అయినవాళ్ల ప్రాణాలు పోతున్నాయని తెలిసీ, అదే సమయంలో బాధను దిగమింగుకుని మరికొందరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకు రావడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని కిమ్స్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు అన్నారు. కొవిడ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన ఎంతో మంది పేద సినీ కార్మికులకు ఆసుపత్రి బిల్లులు జగపతి బాబు చెల్లించారన్నారు. తన అభిమాన నటుడు జగపతిబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసోపేతమని, ఆయన స్ఫూర్తితో మరింతమంది ముందుకు రావాలని కోరారు.
కిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, జీవన్‌దాన్ ఇన్‌ఛార్జి, నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత, అవయవమార్పిడి నిపుణులైన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో అవయవదానం చేసిన పలువురు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి: 1484 రోజుల తర్వాత రణ్‌బీర్.. రిలీజ్ డేట్‌తో వైష్ణవ్ తేజ్