High Tension at Inter Board office : ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు విద్యా మండలి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. కరోనా వల్ల పాఠాలు బోధించకుండా... పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ ప్రశ్నించారు. 52 శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేసి వాళ్లను మానసికంగా కుంగదీశారని అన్నారు. విద్యార్థులందరికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు తగిన న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని... మైదానానికి తరలించారు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల తీరును నిరసిస్తూ.... విద్యార్థి సంఘాలు శుక్రవారం ఆందోళన చేశాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నేతలు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. బోర్డు తీరును నిరసిస్తూ.... పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.... కార్యాలయం ముందు బైఠాయించారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు.... విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య శుక్రవారం కూడా తోపులాట జరిగిది. దీంతో బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
'ఇంటర్ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంతశాతం మంది విద్యార్థులు ఫెయిల్ అవడం ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వం తప్పిదం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డ్ బాధ్యత వహించాలి. ఇంటర్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలి.'
-మూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు
కరోనా సమయంలో కళాశాలల్లో తరగతులు నిర్వహించలేదని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాము శుక్రవారం విమర్శించారు. అయినా ఇంటర్మీడియట్ అధికారులు పరీక్షలు నిర్వహించి... విద్యార్థులను మానసికంగా గందరగోళానికి గురి చేశారని అన్నారు. కేవలం కార్పొరేట్ కళాశాలల కోసమే పరీక్షలు నిర్వహించి... సగానికి పైగా విద్యార్థులను ఫెయిల్ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యార్థి సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని గోషామహల్ మైదానానికి తరలించారు. ఇవాళ ఏబీవీపీ పిలుపుతో... ఇంటర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త నెలకొంది. ఇంటర్ ఫలితాలను నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Tipper Bolta in Hanamkonda Quarry : క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం