రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం... ప్రతి రోజు నలుగురి ఇళ్ళల్లో పాచిపని చేసి కడుపు నింపుకునే వైనం... తనకంటూ సొంత ఇల్లు కూడా లేని ఒంటరి మహిళ... ఈ దుస్థితిలో ఉన్న వారు ఎవరైనా అప్పనంగా డబ్బులు వస్తుంటే వద్దనుకుంటారా...? ఏ కష్టం చేయకుండానే పూట గడవటాన్ని వదులుకుంటారా...? అకారణంగా వచ్చే డబ్బులను నిజాయితీగా వదులుకొని అందరి అభినందనలు అందుకుంది సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన పద్మ అనే మహిళ.
చనిపోయిన తమవారి శవాలతో కూడా సహవాసం చేస్తూ అడ్డదారుల్లో పింఛన్ డబ్బులు తీసుకుంటున్న ఈ రోజుల్లో... 'దివ్యాంగురాలైన నా కూతురు చనిపోయింది, తన పేరు మీద వస్తున్న పింఛన్ నిలిపివేయండి సారూ' అని అర్జీ పెట్టుకొని మరీ.. నిజాయితీ చాటుకుంది ఆ మాతృమూర్తి.
దివ్యాంగురాలైన తన కూతురు చనిపోయినా, ఇంకా తన పేరిట పింఛన్ వస్తోందని... దానిని నిలిపివేయండని మారేడుపల్లి తహసీల్దార్ సునీల్‌కు వినతిపత్రం ఇచ్చి అందరి అభినందనలు అందుకుంది సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన పద్మ. కడుపేదరికంలో ఉండి కూడా నిజాయితీని చాటుకున్న పద్మను అభినందించారు సునీల్. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది కలిగినా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.
నిజాయితీకి గీటురాయి...
పద్మకు ఒక్కగానొక్క సంతానం అలేఖ్య... పుట్టుకతోనే అంగవైకల్యం... పాప జన్మించిన నాలుగేళ్ళకు భర్త జరిగిపోయాడు. కూతురి పేరిట ప్రతి నెలా దివ్యాంగుల కోటాలో పింఛన్ వచ్చేది. ఆ డబ్బుతోనే ఇంటిని చక్కబెట్టుకొని.. పాపని అల్లారు ముద్దుగా చూసుకునేది. గతేడాది జూన్‌లో కూతురు కూడా చనిపోవటం వల్ల పద్మ ఒంటరిగా మారింది. అయినప్పటికీ అలేఖ్య పేరిట పింఛన్ వస్తుండటంతో దానిని రద్దు చేయాలని మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించింది.
చనిపోయిన కూతురు పేరు మీద వస్తున్న డబ్బులు సరికాదని... అసలైన లబ్ధిదారులకే అవి చేరాలని కోరుకుంటునట్లు తెలిపింది ఈ ఆదర్శమూర్తి.
ఇవీ చూడండి : ప్యారడైజ్ బిర్యానీ భలే బాగుంది: థాయ్ ఉపప్రధాని