పుట్టినందుకు సమాజానికి ఏదో చేయాలనే తలంపు ఉండి... వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదలక ముందుకెళ్లే వాడే మహనీయుడు! ఈ కోవకు చెందిన వాడే మన మన్యంపులి కృష్ణ ప్రసాద్. ఎక్కడో ఏజెన్సీలో పుట్టి... కొండ కోనల్లో పెరిగి... నేడు అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఓ పక్క సమాజ సేవ చేస్తూనే... మరోపక్క ప్రపంచ ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించి దేశ కీర్తిని పతాక స్థాయిలో నిలుపుతున్నాడు.
వ్వవసాయ కుటుంబంలో పుట్టి...
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం లగిశపల్లికి చెందిన ఓ గిరిజన యువకుడు వివిధ ఖండాల్లో ఎత్తైన పర్వాతాలు అధిరోహించాడు. కన్న వారికి, ఉన్న ఊరికే కాకుండా దేశానికే మంచి పేరు తెస్తున్నాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి... న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. విశాఖ కోర్టులో న్యాయవాదిగా ఓనమాలు నేర్చుకుంటూ ఆ పల్లెకే పేరు తెస్తున్నాడు కృష్ణ ప్రసాద్.
ఏజెన్సీ నుంచి... శిఖరం అంచు వరకూ...
సాహసం గిరిపుత్రుల రక్తంలోనే ఉంటుంది. కొండ, కోనల్లో అలుపెరగక తిరగటం వారికి వెన్నతో పెట్టిన విద్యే! బడిలో చదివే రోజుల్లోనే చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఎక్కేసేవాడు కృష్ణ ప్రసాద్. తోటి స్నేహితులు వద్దని వారించినా... వినకుండా బాహుబలిలా అవలీలగా ఎత్తైన బండలపైకి ఎగబాకేవాడు. ఇక 5కే, 10కెే, 25కెే రన్‌లు ఎవరైనా నిర్వహిస్తే.. ప్రసాద్‌కు పండగే! చిన్నప్పటి నుంచీ ఇవన్నీ చేయటం వల్లే.. ఇప్పుడు శిఖరాలను సరదాగా అధిరోహిస్తున్నానని చెబుతున్నాడు ఈ మన్యం వీరుడు.
కిలిమంజారోతో నెరవేరిన కల..
ప్రపంచ ఘనతలు సాధించడం అంత సునాయాసనం కాదు. అందులోనూ ప్రపంచ ఎత్తైన శిఖరాలు అధిరోహించాలంటే... యజ్ఞం చేయాల్సిందే! చిన్నప్పటి నుంచి మారథాన్ పరుగు, సామాజిక సేవల్లో ముందుండే ప్రసాద్‌కు 2018లో అనుకోని అవకాశం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో అధిరోహించే అవకాశం కల్పించింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో తొలిసారి తన కలను నెరవేర్చుకున్నాడు ఈ గిరి పుత్రుడు.
ఎల్ బ్రోస్తో చెరగని జ్ఞాపకం...
అదే ఆకాంక్షతో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రసాద్‌ను అదృష్టం వరించింది. 2019లో యూరప్ ఖండం రష్యాలోని ఎల్ బ్రోస్ పర్వతం అధిరోహించే అవకాశం వచ్చింది. కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం వెక్కిరించింది. ఆప్తులు, సహచర న్యాయవాదుల సహకారంతో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డీకే బాలాజీని కలిశారు. ఆయన ఛార్జీలను సమకూర్చారు. విశాఖ పోర్టుట్రస్ట్, తోటి న్యాయవాదులు, అంబికా దర్బార్ అగరవత్తుల కంపెనీ వారు మిగిలిన సాయం అందించారు. ఈ నెల జులై 6న ఆ ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నాడు ఈ అల్లూరి. మహిళా ఐపీఎస్ శాలిని అగ్నిహోత్రి తనకు ఆదర్శమని చెబుతున్నాడు మన కృష్ణ ప్రసాద్.
ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి క్రొవ్వి యే రాదగునే
అక్కట మును సనుదెంచిన
దిక్కిదియని యెరుగ వెడలుతెరు వెయ్యదియో!
అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్రములో ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళ్లాలనుకుంటాడు. కానీ వ్యక్తిగత కారణాలతో వెళ్లలేకపోతాడు. ఈ తరుణంలో ఓ సిద్ధుడు ఆతిథ్యం కోరి ఇంటికి వస్తాడు. ప్రవరుడి వేదనను అర్థం చేసుకుని ఏం జరిగిందని అడుగుతాడు. ప్రవరుడు తన మనసులో మాటను బయట పెడతాడు. సిద్ధుడు ప్రవరుని పాదాలకు లేపనం పూయగా.. క్షణ కాలంలోనే హిమగిరికి చేరుకుంటాడు. ఆ సమయంలో ఎక్కడి యరుణాస్పదపుర మెక్కడి తుహినాద్రి అంటూ తన భావాలను వ్యక్తపరుస్తాడు. కానీ ఇప్పుడు క్షణకాలంలో పర్వతాలకు వెళ్లలేం. శిఖరాలు ఎక్కలేం. సాహసం చేసి వెళ్లినా... తిరిగొస్తామన్న ఆశ లేదు!
ఇప్పుడు ఆ లేపనాలు లేవు. ఆ మాయలు లేవు. అయినా కృష్ణ ప్రసాద్ ఆగలేదు. అతని ఆశయం ముందు ఆ పర్వతం నిలువలేదు! ఏ ఆకు పసరూ లేకుండానే ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు ఈకాలం నాటి మన ప్రవరుడు!!
ఇదీ చూడండి వరదలు: 120 మందిని రక్షించిన వాయుసేన