మహానగర జలాశయాలు రసాయన కారాగారాలుగా మారుతున్నాయి. మురుగుతోపాటు రసాయన వ్యర్థాలు, చెత్తా, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను చెరువుల్లోనే పడేస్తుండడం వల్ల మినీ డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. దీనికితోడు పారిశ్రామిక వ్యర్థాలు తోడవ్వడంతో చెరువుల్లోని జలచరాలకు ఆక్సిజన్ అందని పరిస్థితి నెలకొంది.
కబ్జాలే ప్రధాన సమస్య...
కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే సీవేజ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రశాంత్‌నగర్‌లోని ఖాజాకుంటలో ఈ తరహా సీవేజ్ ప్లాంట్‌ను నిర్మించారు. అంబీర్ చెరువులోని ఎఫ్‌టీఎల్ పరిధిలోనే నాలాను నిర్మించారు. అది తాత్కాలికమే అని అధికారులు చెబుతున్నప్పటికీ అక్కడి ఆర్‌సీసీ నిర్మాణం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక్కడ నిర్మించే వాకింగ్ ట్రాక్ రిటైనింగ్ వాల్‌ను బఫర్‌జోన్‌లో కాకుండా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. నగరంలోని పటేల్‌కుంట చెరువు, గంగారం చెరువు, సున్నం చెరువు, హస్మత్ చెరువు, కాముని చెరువుల్లోనూ దాదాపూ ఇదే పరిస్థితి. డ్రైనేజీ లైన్లను పూర్తిగా ఈ చెరువుల్లోకే వదిలేస్తున్నారు. ఎల్లమ్మ చెరువు 18 ఎకరాల వరకు కబ్జా అయినట్లు పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు.
చెరువు మొత్తం వ్యర్థాలతో నిండిపోవడంతో రసాయన నురగలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై గతంలో హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. నగరంలోని రంగథాం చెరువు, నెక్నాంపూర్ చెరువు, లింగంపల్లిలోని చాకలివాని చెరువుల్లో, మియాపూర్ పెద్ద చెరువులు పూర్తిగా కలుషితమైపోయి రసాయన నురగలు వెలువడుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
మురుగును వదిలేసి... సుందరీకరణ
చెరవుల సుందరీకరణ పేరుతో మురుగు జలాశయాలుగా మారిన చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. అయితే చెరువులో మురుగునీటిని శుద్ధి చేసిన అనంతరం సుందరీకరణ చేపట్టాలంటూ పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మురుగునీరు, వరద నీటికి ప్రత్యేకమైన లైన్లను ఏర్పాటు చేయడంతోనే వీటికి పరిష్కారం లభిస్తుందంటున్నారు.
ప్రాణవాయువు సున్నా...
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బీఓడీ) పరిమాణం ఆధారంగానే జలవనరులు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయా లేదా అనేది గుర్తిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశిత పరిమితుల ప్రకారం డీఓ పరిమాణం లీటర్‌లో కనీసం 4ఎంజీలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే జలచరాలు బతకవు.
బీఓడీ 3ఎంజీల కంటే తక్కువగా ఉండాలి.. బీఓడీ పెరుగుతుందంటే కాలుష్యంతో కంపు కొడుతున్నట్లు లెక్క. గతంలో పీసీబీ 40కి పైగా చెరువుల నీటి నాణ్యతపై అధ్యయనం చేయగా 8 చెరువుల్లో ప్రాణవాయువు సున్నాగా ఉందని తేలింది. ప్రగతినగర్ చెరువు, లక్ష్మీనారాయణ చెరువు, ఉమ్దాసాగర్, ప్రేమాజీపేట, కాముని చెరువు, లోటస్‌పాండ్, లంగర్‌హౌజ్ చెరువు, హస్మత్‌పేట చెరువు, అంభీర్‌చెరువు, పెద్ద చెరువు, పల్లె చెరువు, లింగం చెరువు, బంజారాకుంట, పర్కి చెరువు, మన్నెవారికుంట తదితర చెరువుల్లో డీఓ తక్కువగా ఉంది.
బీఓడీ ఎక్కువగా ఉంది. నెక్నాంపూర్ చెరువు, మీరాలం ట్యాంక్, ఫాక్స్‌సాగర్, సున్నంకుంటలో డీఓ 4ఎంజీల కంటే ఎక్కువగానే ఉంది. బీఓడీ నిర్దేశిత పరిమితుల కంటే రెండు నుంచి 6రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇవీచూడండి: వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే..