ఇంట్లో ఉన్న పాతపుస్తకాలని, చిత్తు కాగితాలని పదికీ, పరక్కీ తూకం లెక్కన అమ్మేస్తుంటారు చాలామంది. అలా అమ్మేయకుండా ఆ పుస్తకాలని వాటి అవసరం ఉన్న విద్యార్థులకు ఇస్తే ఎంతో మేలు చేసినట్టువుతుంది కదా అనుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన ఆళ్ల లక్ష్మిదుర్గ. ఈ ఆలోచన ఆమెకి బీటెక్ చదువుతున్నప్పుడు వచ్చింది. ఆమె తండ్రి టీస్టాల్ నడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా లక్ష్మి సాయం చేసేందుకు వెనకడుగు వేయలేదు. అప్పటినుంచి స్నేహితులు, తెలిసినవారి దగ్గర పుస్తకాలు సేకరించి పంచిపెట్టేది. ఈ అంశానికి తగినంత ప్రచారం దొరికితే.. మరింతమందికి మేలవుతుందనుకుంది. అందుకు సామాజిక మాధ్యమాలని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేసి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో ‘బుక్స్ డొనేషన్’ పేరుతో గ్రూపుల్ని ప్రారంభించింది. మొదట్లో ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. అయినా నిరాశ చెందకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. క్రమంగా కొందరు స్పందించడం మొదలుపెట్టారు. ఆ నోటా ఈనోటా తెలిసి పేద విద్యార్థులకు అవసరమైన బుక్స్ మేం కొనిస్తామంటూ మరికొంతమంది ముందుకు వచ్చారు. అలా ఇప్పటివరకూ 1500 మందికి దాతల సాయంతో విలువైన పుస్తకాలని అందించింది లక్ష్మి.
తానే రాసిస్తూ... ఎంత క్లిష్టమైన పాఠాన్నైనా సరే సులువుగా అర్థమయ్యేలా షార్ట్ నోట్స్ రాయగలదు లక్ష్మి. అవి విద్యార్థులందరికీ చేరువ కావాలని ఒక బ్లాగ్‌ని నిర్వహిస్తోంది. ఇందులో జావా, సీ ప్లస్‌ప్లస్, కోడింగ్ వంటి వాటికి సంబంధించిన నోట్సుని రాసి అందుబాటులో ఉంచింది. కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా నిరుద్యోగులకు కూడా ఉపయోగపడేలా పోటీ పరీక్షలకు అవసరం అయిన పుస్తకాలు, ఉద్యోగ సమాచారం వంటి వాటిని ఫేస్‌బుక్, బ్లాగ్, వాట్సాప్‌ల ద్వారా అందిస్తోంది.
నిరుపేద విద్యార్థినులకు చేయూతనివ్వాలనుకున్నా.. ఆ సంకల్పమే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తోంది. ఓ ఆటో డ్రైవర్ కూతురు వైద్య విద్య చదివేందుకు ఇబ్బందులు పడుతున్నానని వాట్సాప్ వీడియో షేర్ చేసింది. తనకెలాగైనా సాయం చేయాలనుకున్నా. ఇందుకోసం కొన్ని వందల ఫోన్‌కాల్స్ చేశా. మరెందరినో కలిశా. చివరికి దాతల సహకారంతో ఏటా రూ.పదివేలు ఇస్తానని భరోసా ఇవ్వగలిగా. ఓ ల్యాప్‌టాప్‌నీ కొనిచ్చా.
-లక్ష్మిదుర్గ
ప్రస్తుతం చదువు పూర్తి చేసి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. తన జీతంలో కొంతభాగాన్ని పేద విద్యార్థుల చదువుల కోసం కేటాయిస్తోంది. ఇలా ఇప్పటివరకూ పదిమంది విద్యార్థినులు ఆమె సాయంతో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు.
- బాలరాజు తెలికా, విజయవాడ
ఇదీ చదవండి: మీలో ఉన్న చిన్నారిని మిస్సవ్వద్దు!