ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబయి విమానాశ్రయంలో పనిచేస్తున్నాడు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే అంధేరి ప్రాంతంలో నివాసం ఉండేవాడు. లాక్‌డౌన్ విధించడంతో తొలి వారం రోజులు ఇంట్లోనే గడిపాడు. కానీ, వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుండడం అతణ్ని ఆందోళనకు గురిచేసింది. జన సాంద్రత ఎక్కువగా ఉన్న అంధేరీకి వ్యాపిస్తే పెద్ద ప్రమాదం తప్పదని అంచనా వేశాడు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించాడు. దాని కోసం ఉపాయం ఆలోచిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుల్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. వాటిలో నిత్యావసర వస్తువుల రవాణాకు కేంద్రం అనుమతించిన విషయాన్ని గ్రహించాడు. దీన్ని ఆసరాగా చేసుకొని ఎలాగైనా ఇంటికి చేరాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.
ముంబయిలోని ఓ పుచ్చపండ్ల వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నాసిక్‌లోని మార్కెట్‌కు వెళ్లి 1300 కిలోల పండ్లు తెస్తానని హామీ ఇచ్చాడు. దీని కోసం డ్రైవర్‌తో కూడిన ఓ మినీ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. నాసిక్ సమీపంలో ఉన్న పింపల్‌గావ్‌కి వెళ్లి లోడ్‌ను ట్రక్కులోకి ఎక్కించి ముంబయికి పంపాడు. తాను మాత్రం అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి మళ్లీ అలహాబాద్‌కు ఎలా వెళ్లాలో ఆలోచించాడు. మార్కెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఉల్లికి బాగా గిరాకీ ఉండడం గమనించి దాన్ని కొనుగోలు చేసి అలహాబాద్ మార్కెట్‌కు తరలించాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఒక కిలోకు రూ.9.10లతో 25,520 కిలోల ఉల్లిని కొనుగోలు చేశాడు. రూ.77,500కు ఓ లారీని మాట్లాడుకున్నాడు. లోడ్ దాంట్లోకి ఎక్కించి ఎక్కడా.. ఎలాంటి.. అవాంతరం లేకుండా మూడు రోజుల్లో అలహాబాద్ చేరుకున్నాడు. కానీ, అక్కడ ఉల్లిని కొనడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవటం వల్ల అదే ట్రక్కును కొద్ది దూరంలో ఉన్న తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అలా మొత్తానికి ఉల్లి సాయంతో ఇంటికి చేరాడు.
అయితే, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తనకు ఎక్కడైనా వైరస్ సోకే ప్రమాదం ఉందని పసిగట్టినట్లున్నాడు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దని భావించి లోడ్‌ను ఖాళీ చేయగానే తానే స్వయంగా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్ల పోలీసులు, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు.