కొత్త సచివాలయ భవన నిర్మాణ సన్నాహాల్లో భాగంగా సచివాలయంలోని కార్యాలయాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇకపై బీఆర్కే భవన్ నుంచే సచివాలయ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. దీనికోసం భవన్ వద్ద భద్రతా, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయనున్నారు. సచివాలయ భద్రతను ప్రత్యేక భద్రతా విభాగం చూస్తోంది. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు సచివాలయానికి పహారా కాస్తుంటారు. ఇప్పటికే భవన్‌ను ఎస్పీఎఫ్ తన స్వాధీనంలోకి తీసుకొంది. అధికారులు, ఉద్యోగులు మినహా మిగతా ఎవరూ ఎస్పీఎఫ్ అనుమతి లేకుండా లోనికెళ్లే పరిస్థితి లేదు.
సచివాలయం తరహాలోనే...
ప్రస్తుతం సచివాలయంలో 72 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. అందులో తొమ్మిది ప్యాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు. ఇవి 360 డిగ్రీల మేర దృశ్యాలను చిత్రీకరిస్తాయి. రాత్రి వేళల్లోనూ సులభంగా చిత్రీకరించేలా వీటికి లైటింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి. సచివాలయ ప్రవేశద్వారాలు మొదలుకొని అన్ని బ్లాకుల్లో కదలికలపై సీసీ కెమెరా వ్యవస్థ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసం సీ, డీ బ్లాక్‌లతో పాటు ముఖ్య భద్రతాధికారి కార్యాలయాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్నాయి. సచివాలయం తరహాలోనే ఇప్పుడు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోనూ పటిష్ఠమైన సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి అంగుళం నిఘా...
బీఆర్కే భవన్లో మొత్తం తొమ్మిది అంతస్తులున్నాయి. ఒక్కో అంతస్తులో నాలుగు బ్లాకులున్నాయి. ప్రతి అంతస్తులో లిఫ్ట్, మెట్లకు ఎదురుగా ఒకటి, కారిడార్ల మధ్యలో మరొటి ఉంటాయి. కారిడార్ రెండు చివర్లలో మిగతా రెండు సీసీ కెమెరాల చొప్పున నాలుగు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భవన్‌లోని ప్రతి అంగుళం గమనించొచ్చని అధికారులు చెప్తున్నారు.
తరలింపు పూర్తయ్యే నాటికి పూర్తి భద్రత
బీఆర్కే భవన్‌తో పాటు కొన్ని కార్యాలయాలను ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి తరలించనున్నారు. అక్కడ కూడా అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్న పీటీజెడ్ కెమెరాలను బీఆర్కే భవన్ పైన నలువైపులా ఏర్పాటు చేయనుయన్నారు. తద్వారా నాలుగు కిలోమీటర్ల వరకు పరిసరాలను పూర్తి స్థాయిలో నిఘా ఉంచేందుకు దోహదపడుతుంది. బీఆర్కే భవన్ ప్రవేశద్వారం వద్ద, ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. తరలింపు ప్రక్రియ పూర్తయ్యే నాటికి సీసీకెమెరాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం తరలివెళ్లే బేగంపేటలోని మెట్రో రైల్‌భవన్‌లో ఇప్పటికే సీసీకెమెరాల వ్యవస్థ ఉంది. అవసరమైతే అక్కడ కూడా అదనపు కెమెరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: బీఆర్కే భవన్‌కు తరలిన సచివాలయం