దేశంలో అన్ని నగరాల్లో జనాభా పెరుగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోనూ జనాభా పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతోందని తెలిపారు. వృత్తి, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలసలు పెరిగాయన్న ఆయన.. నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్‌పేట పరిధిలో రూ. 2.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 280 సీసీ కెమెరాలను డీసీపీ కార్యాలయంలో ప్రారంభించారు.
తెలంగాణ ముందుంది..
నేరాలను అరికట్టేందుకు మంచి పోలీస్ వ్యవస్థ తెచ్చేలా కేంద్రం కృషి చేస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల పోలీసులు బాగా పనిచేస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. గతంలో నేరాలను రుజువు చేసేందుకు చాలా కష్టమయ్యేదన్న ఆయన.. సాంకేతికత ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో తెలంగాణ ముందుందని కితాబిచ్చారు.
ఫోరెన్సిక్ విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి కృషి..
ఈ సందర్భంగా సేఫ్ సిటీ ప్రాజెక్టు కింద 8 నగరాలను ఎంపిక చేసినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. మెట్రో నగరాల్లో నేరాల నియంత్రణకు మొదటి ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ప్రపంచంలోనే తొలి ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీని దేశంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపిన కిషన్‌రెడ్డి.. త్వరలోనే జాతీయ రక్షణ వర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను మార్చేందుకు ప్రధాని యోచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సీసీ కెమెరాలతో ఎంతో ఉపయోగం..
2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు అన్ని రంగాల్లో ముందున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ముఖ్యమైన కేసుల విచారణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.