రెండున్నరేళ్ల బుడతడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్తోపాటు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించాడు. బుల్లి బుల్లి అడుగులతో అందరి హృదయాలను హత్తుకునే వయసులోనే... వేమన పద్యాలను చెప్పి తనదైన ప్రతిభ పాటవాలను ప్రదర్శించాడు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన వెంకట సత్యనారాయణ-సుకన్య దంపతుల కుమారుడు ఆదిత్య.
హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీత్యాగరాయ సభలో 60 నిమిషాల్లో 100 వేమన పద్యాలను చూడకుండా చెప్పి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్తోపాటు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో కొత్త ఘనత సాధించాడు. మాటలు స్పష్టంగా రాని వయసులోనే వేమన పద్యాలు చెప్పడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఆడుతూ పాడుతూ తల్లి ఆలనాపాలన మధ్య చిన్నోడు ఆదిత్య వేమన పద్యాలను కంఠస్థం చేసి ఔరా అనిపించాడు. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ ప్రతినిధి నరేందర్ గౌడ్ ధ్రువీకరణ పత్రాలను వారికి అందజేశారు. తమ కుమారుడు చెప్పిన ప్రతి మాటని క్షణాల్లో కంఠస్థం చేసిన సందర్భాన్ని గమనించి రెండు నెలల్లో 100 వేమన పద్యాలు నేర్పినట్లు ఆదిత్య తల్లి సుకన్య తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు!