సికింద్రాబాద్ సైనిక్‌పురిలో ఉంటున్న మనోజ్ సిక్దర్, గీతా సిక్దర్ దంపతులకు 2007 అక్టోబరు 14న జన్మించాడు మిహిర్. మనోజ్ భారత సైన్యంలో పని చేశారు. మిహిర్ పుట్టిన 6 నెలలకు జన్యు సంబంధిత అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. ఆరోగ్యం విషమిస్తుండటంతో 2014 జులైలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆనాటి నుంచి ఇప్పటివరకు ఆ బాలుడు ఒకటే మంచం మీద జీవితం వెళ్లదీస్తున్నాడు.
న్యూరో ఫ్రైబ్రో మ్యాటోసిస్ టైప్-1, మోయామోయా సిండ్రోమ్ (మెదడులోని రక్తనాళాలు కుంచించుకుపోవడం), కైఫోస్కోలియోసిస్ (వెన్నెముక రుగ్మత), శరీరం నల్లగా మారడం, ఎముకల ఎదుగుదల లేకపోవడం వంటి పలు వ్యాధులతో మిహిర్ బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో ఆరోగ్యం ఏ క్షణమైనా విషమించవచ్చునని చెప్పారు. భారత సైన్యంలో మిహిర్ తండ్రి పదవీ విరమణ చేయడంతో కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీం ద్వారా ఆ పిల్లాడికి వైద్య సాయం అందిస్తోంది.