సచివాలయ భవనాల కూల్చివేత, శిథిలాల తరలింపును పరిశీలించేందుకు మీడియాకు ఇవాళ ప్రభుత్వం అనుమతిచ్చింది. కూల్చివేతలు కొనసాగుతున్న తరుణంలో పోలీసులు దగ్గరుండి మరీ వాహనాల్లో మీడియా ప్రతినిధులను సచివాలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. కిందకు దిగనివ్వకుండా వాహనాల్లోంచే కవరేజీకి అనుమతించారు. మొత్తం 11 బ్లాకులు ఉండగా జే, ఎల్ మినహా తొమ్మిది బ్లాకులు, విద్యుత్ శాఖకు చెందిన రాతికట్టడం సహా ఇతర నిర్మాణాలన్నీ పూర్తిగా నేలమట్టం అయ్యాయి.
లక్ష టన్నుల శిథిలాలు
జే, ఎల్ బ్లాకుల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. భారీ యంత్రాల సహాయంతో భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో గుట్టలు గుట్టలుగా శిథిలాలన్నీ పడిఉన్నాయి. శిథిలాల్లో నుంచి ఇనుము, గ్లాస్ లాంటి వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇందుకోసం గ్యాస్ కట్టర్లను వినియోగిస్తున్నారు. కూలింగ్ ప్రక్రియ కూడా చేస్తున్నారు. శిథిలాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వేరు చేసిన శిథిలాలను ఎప్పటికప్పుడు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. దాదాపు లక్ష టన్నుల శిథిలాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాటి తరలింపునకు నెల రోజుల సమయం పడుతుందని అంచనా.
వీలైనంత త్వరలోనే..
కూల్చివేత, శిథిలాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యాక కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని సిద్ధం చేస్తారు. వీలైనంత త్వరలో సచివాలయ నమూనాకు ఆమోదం తెలిపి టెండర్లు పిలిచేందుకు రహదార్లు, భవనాల శాఖ సిద్ధమవుతోంది. రూ.500 కోట్ల అంచనా వ్యయంతో అన్ని హంగులు కలిగిన అత్యాధునిక సచివాలయ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'