ఏపీలోని ప్రకాశం జిల్లాలో వేర్వేరు చోట్ల శానిటైజర్ తాగిన ఘటనల్లో మొత్తం పదమూడు మంది మరణించారు. కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతిచెందగా.. పామూరులో మరో ముగ్గురు తుదిశ్వాస విడిచారు. మద్యానికి బానిసైన వీరు.. లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల శానిటైజర్ తాగారు. అధిక మొత్తంలో శానిటైజర్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కడుపునొప్పితో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కురిచేడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 రోజులుగా లాక్ డౌన్ విధించారు. ఫలితంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మద్యం దొరక్కపోవడంతో మొత్తం 20 మంది కలిసి శానిటైజర్ తాగేందుకు అలవాటు పడినట్లు సమాచారం. 10 రోజులుగా శానిటైజర్ తాగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పితో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న అధిక మొత్తంలో శానిటైజర్ తాగి తొలుత ఒకరి చనిపోయారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా రాత్రికి ముగ్గురు కన్నుమూయగా... ఇప్పటికి ఈ సంఖ్య 10కు పెరిగింది. మృతుల్లో ఇద్దరు యాచకులు ఉండగా.. ఇద్దరు వృద్ధులు ఉన్నారు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. 10 రోజులుగా శానిటైజర్ తాగుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పినట్లు ఎస్పీ వివరించారు. చుట్టుపక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్ సీజ్ చేసి పరీక్షలకు పంపిస్తామని ఎస్పీ వెల్లడించారు. శానిటైజర్స్ నేరుగా తాగారా లేదా వేరే ద్రవంతో కలిపి తాగారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.