దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించిన రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 1న బయల్దేరే రైళ్లకు గురువారం ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ ప్రారంభం కాగానే ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చింది.ఉదయం 10 గంటలకు ప్రయాణికులు ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో టికెట్ల కోసం ప్రయత్నించారు.
తెలంగాణ ఎక్స్‌ప్రెస్, గోదావరి, హుస్సేన్‌సాగర్, ఫలక్‌నుమా, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆరోజు ప్రయాణాలకు టికెట్లు అరగంట వ్యవధిలోనే అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఫలక్‌నుమా, గోదావరి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నప్పటికీ ఒక్క దాంట్లోనూ ఖాళీ లేదు. రిజర్వేషన్ ప్రక్రియ మొదలైన మొదటి రెండున్నర గంటల్లోనే దేశంలో నాలుగు లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దిల్లీలో తెలిపారు.
ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణం
జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారినే ప్రయాణాలకు అనుమతిస్తారు. వారివద్ద ఆరోగ్య సేతు యాప్‌తో కూడిన మొబైల్ ఉండాలి. టికెట్లను ప్రయాణ తేదీకి గరిష్ఠంగా 30 రోజుల ముందుగా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లలో సీనియర్ సిటిజన్లు, మరికొన్ని కేటగిరీల వారికి రాయితీలు ఉండవు. విద్యార్థులకు, నాలుగు రకాల వైకల్యాలు ఉన్న దివ్యాంగులకు, 11 రకాల రోగులకు మాత్రం రాయితీ రైల్వే ఇవ్వనుంది. అందరూ మాస్క్ ధరించడం తప్పనిసరని స్పష్టం చేసింది.
తెరచుకోనున్న రిజర్వేషన్ కౌంటర్లు
శుక్రవారం నుంచి ఎంపిక చేసిన స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు తెరవనున్నారు. దేశంలో 1.7 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు, టికెట్ ఏజెంట్ల ద్వారానూ రిజర్వేషన్‌కు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ప్రత్యేక రైళ్లలో టికెట్ల రిజర్వేషన్లకు తెలంగాణలో 18 రైల్వేస్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44 రైల్వేస్టేషన్లతో పాటు జోన్ పరిధిలోకి వచ్చే మరో 11 చోట్ల రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను శుక్రవారం నుంచి తెరవనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
నకిలీ పేర్లతో బుకింగ్‌పై ఆర్‌పీఎఫ్ దృష్టి
ప్రత్యేక రైళ్లలో ఈ-టికెట్లను వివిధ వ్యక్తిగత ఐడీల ద్వారా నకిలీ పేర్లతో బుకింగ్ చేసేవారిపై రైల్వే భద్రత దళం(ఆర్‌పీఎఫ్) దృష్టి సారించింది. నకిలీ పేర్లతో టికెట్లు బుక్ చేసిన 14 మందితో పాటు 8 మంది ఐఆర్‌సీటీసీ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తెలిపింది. వారి నుంచి రూ.6.36 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.