హైదరాబాద్ వరద ప్రాంతాల్లో సాధారణ స్థితులు తెచ్చేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 13న కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీల్లోని 35 వేల 309 కుటుంబాలు ముంపునకు గురైనట్లు వెల్లడించారు.
గుర్రం చెరువు నీరు వచ్చే అవకాశముందని... శనివారం సాయంత్రమే 2 వేల కుటుంబాలను ముందస్తుగా ఖాళీ చేయించామన్నారు. మొత్తం 37 వేల కుటుంబాలు వరద ముంపునకు గురయ్యారని... బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేషన్ కిట్, మూడు బ్లాంకెట్లు ఇస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాల ఇళ్ల వద్దకే వెళ్లి, అందజేస్తున్నామని... ఇప్పటివరకు 20 వేల రేషన్ కిట్స్, బ్లాంకెట్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన రేషన్ కిట్స్, బ్లాంకెట్లను సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
వరద ప్రాంతాల్లోని కుటుంబాలకు పాలు, బ్రెడ్, బిస్కెట్లను అందజేస్తున్నట్లు వివరించారు. మధ్యాహ్నం 90 వేలు, సాయంత్రం 60 వేల భోజనాలు రెగ్యులర్ అన్నపూర్ణ కేంద్రాలతో పాటు వరద ప్రాంతాల్లో ప్యాకింగ్ చేసి ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. నగరంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!