Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించగా.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. గతేడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు నామినేషన్లు స్వీకరించిన కేంద్రం.. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పురస్కారాలకు ఎంపికైన వారి జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది పద్మ పురస్కారాలను అందుకోగా.. వీరిలో ఇద్దరిని పద్మభూషణ్ వరించింది. చినజీయర్ స్వామి, కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్ పురస్కారం లభించగా.. రాష్ట్రానికి చెందిన బి.రామకృష్ణారెడ్డి, ఎం.విజయగుప్తా, పసుపులేటి హనుమంతరావులను పద్మశ్రీ పురస్కారం వరించింది. వీరితో పాటు ఏపీకి చెందిన సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, సంకురాత్రి చంద్రశేఖర్, కోట సచ్చిదానంద శాస్త్రి, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ప్రకాశ్ చంద్రసూద్, సి.వి.రాజు, గణేశ్ నాగప్ప కృష్ణరాజనగరకు పద్మశ్రీ దక్కింది. సామాజిక సేవా విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌లను పద్మశ్రీ పురస్కారం వరించింది. సంకురాత్రి చంద్రశేఖర్ తన జీవితాన్ని సమాజానికే అంకితం చేశారు. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు పేలుడు ఘటనలో తన భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయినా ఆ బాధను దిగమింగుకొని జీవితాన్నంత సామజిక శ్రేయస్సు కోసం పునరంకితమై కృషి చేస్తున్నారు.
పద్మభూషణ్ తెలంగాణ..
- చినజీయర్ స్వామికి పద్మభూషణ్ పురస్కారం
- కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్ పురస్కారం
పద్మశ్రీలు తెలంగాణ..
- బి.రామకృష్ణారెడ్డి
- ఎం.విజయగుప్తా
- పసుపులేటి హనుమంతరావు
పద్మశ్రీలు ఆంధ్రప్రదేశ్..
- సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి
- సంకురాత్రి చంద్రశేఖర్
- కోట సచ్చిదానంద శాస్త్రి
- అబ్బారెడ్డి నాగేశ్వరరావు
- ప్రకాశ్ చంద్రసూద్
- సి.వి.రాజు
- గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర
దేశంలో కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడా, సామాజిక, విజ్ఞాన, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పారిశ్రామిక, తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి ఏటా పురస్కారాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చూడండి..
ORS పితామహుడికి పద్మవిభూషణ్.. ములాయం సింగ్, జాకీర్ హుస్సేన్ సహా ఆరుగురికి
'ప్రజాస్వామ్య గణతంత్రంగా భారత్ విజయవంతం.. వారి ఆదర్శాల వల్లే'