రాష్ట్ర పోలీస్ శాఖలో బదిలీల పర్వం కొనసాగుతోంది. నిఘా విభాగం డీజీ, సైబరాబాద్ సీపీలను.. ప్రభుత్వం నిన్న బదిలీ చేసింది. అంతేకాకుండా నలుగురు సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ హోదా ఇచ్చింది. తాజాగా 19 మంది డీఎస్పీల బదిలీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, పశ్చిమమండలం ఐజీ స్టీఫెన్ రవీంద్రకు స్థానచలనం కలిగింది. స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్‌గా, సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. దీంతో చాన్నాళ్ల తర్వాత ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ వచ్చారు. డీజీపీ హోదాలో ఉన్న గోపికృష్ణ గత నెల పదవీ విరమణ పొందారు. అనిశా డీజీ పూర్ణచందర్ రావు ఈ నెల పదవీవిరమణ పొందనున్నారు. జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేదీ వచ్చే నెలలో పదవీవిరమణ పొందుతారు. వారిస్థానాలను ప్రస్తుతం పదోన్నతి పొందిన డీజీపీలతో భర్తీ చేసే అవకాశం ఉంది. రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ బదిలీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, విశ్వప్రసాద్ డీఐజీలుగా పదోన్నతి పొంది రెండేళ్లు దాటినా.. సీపీ స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వారిని ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉంది.
డీజీపీ హోదా..
హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్, గోవింద్ సింగ్, రవిగుప్తాకు డీజీపీ హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంజనీ కుమార్ హైదరాబాద్ సీపీగా డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. గతంలోనే ఈ పోస్టును మహేందర్ రెడ్డి సీపీగా ఉన్నప్పుడు అదనపు డీజీ నుంచి డీజీపీ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ రవిగుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గోవింద్ సింగ్ సీఐడీ డీజీగా పనిచేస్తున్నారు. ఉమేశ్ షరాఫ్ పోలీస్ శాఖ సంక్షేమ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇప్పటి వరకు అదనపు డీజీ హోదాలో ఉన్నారు.
ఇదీచూడండి: పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు, బదిలీలు