గ్రేటర్‌లో కరోనా కోరలు చాస్తోంది. కేసులకు కళ్లెం పడడం లేదు. తాజాగా శుక్రవారం గ్రేటర్ వ్యాప్తంగా 1658 మందికి కొవిడ్-19 నిర్ధారణ అయింది. కరోనా కేసులు ప్రారంభమయ్యాక రికార్డు స్థాయిలో శుక్రవారం పాజిటివ్‌లు వచ్చాయి. గాంధీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు. కూకట్‌పల్లి, మూసాపేటలో తాజాగా 12 మందికి వైరస్ సోకింది. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో 9 మందికి, శేరిలింగంపల్లి సర్కిల్‌లో 15 కేసులు నమోదయ్యాయి. అల్వాల్‌లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడంలేదు. ఆప్రాంతం నుంచి ఇప్పటివరకు 80 మందికి మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల్లో చేరారు.
గాంధీలో 750 మంది
అంబర్‌పేటలోని 52 మందికి తాజాగా కరోనా సోకడం కలకలం రేపింది. ఒక్కో కాలనీ, అపార్ట్‌మెంట్‌లో కుటుంబాల్లో సభ్యులంతా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా వయసు ఎక్కువ ఉన్నవారిలో జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఆరోగ్యం విషమంగా ఉన్నవారికి సైతం పడకలు లభించడం లేదు. ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 750 మంది వరకు చికిత్స తీసుకుంటున్నారు.
బాధితులకు తంటా.. దళారులకు పంట
ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల కొరతను కొందరు దళారులు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరా తీసుకొని ఫలానా ఆసుపత్రిలో తెలిసిన వారున్నారని, పడకలు ఇప్పిస్తామని తమకు కమీషన్ కింద కొంత ముట్టజెప్పాలని కోరుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల మార్కెట్ సిబ్బంది గ్రూపుగా ఏర్పడి అవసరాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పడకలు ఖాళీగా ఉన్న ఆసుపత్రుల వివరాలు తెలుసుకొని వాటిని పైరవీలతో ఇతరులకు కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. తమకు తెలిసిన నర్సింగ్‌హోంల సిబ్బంది, వైద్యులకు ఫోన్లు చేసి బహిరంగంగా రేట్లు చెబుతున్నట్లు పేర్కొంటున్నారు.
వారికే తొలి ప్రాధాన్యం
రోజుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష అవుతుందని... భరించగలిగితే పడక కేటాయిస్తామంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు మార్గం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి. మధ్యవర్తులు, ఇతరుల మాటలు నమ్మవద్దని సూచిస్తున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరగడంతో వాస్తవంగా పడకలకు డిమాండ్ ఉందని, అత్యవసరమైన రోగులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య