హైటెక్‌సిటీ.. హైదరాబాద్ నగరానికి గుండెకాయ. ఎన్నో దేశీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. ఐటీ కారిడార్‌లో ప్రైవేట్ వసతి గృహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు చెందినవారే ఉంటున్నారు.
వీరితోపాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందంటూ మిగిలినవారు కూడా ఈ వసతిగృహాల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శివారుల్లో ‘దిశ’ హత్యోదంతం తర్వాత సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఐటీ ఉద్యోగినులకు మేమున్నామంటూ భరోసా కల్పించేలా భద్రతకు పెద్దపీట వేశారు.
ఆన్‌లైన్, ఇతర మార్గాల ద్వారా తమ ఇబ్బందులను నేరుగా తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే చాలా మంది ఐటీ ఉద్యోగినులు ప్రైవేట్ వసతి గృహాల్లోని పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. భద్రతకు సంబంధించి నిర్వాహకులు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదంటూ తరచూ ఫిర్యాదులు రావడంతో సీపీ సజ్జనార్ అప్రమత్తమయ్యారు.
20 బృందాలతో తనిఖీలు చేయించగా..
సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారం (ఎస్‌సీఎస్‌సీ)తో ప్రైవేట్ మహిళా వసతి గృహాలను కొంతకాలం కిందట సీపీ సజ్జనార్ తనిఖీ (ఆడిట్) చేయించారు.
20 బృందాలు రంగంలోకి దిగి.. మాదాపూర్ జోన్ పరిధిలోని హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం తదితర పీఎస్ పరిధిలోని 140 వసతి గృహాలను జల్లెడ పట్టారు. కొన్నింటిలోనేమో భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటుండగా మరికొన్నింటిలో గాలికొదిలేశారు.
సీసీ కెమెరాల సంగతి పక్కన పెడితే ప్రవేశద్వారం వద్ద కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి నిపుణుల సూచనలు, సలహాలతో 10 సూత్రాలను రూపొందించారు. నిర్వాహకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఏమేం పాటించాలంటే..
వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలుండాలి. సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరి.
ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలుండాలి.
5 అడుగుల ప్రహరీ ఉండాల్సిందే.
సందర్శకుల పుస్తకం నిర్వహించాలి.. వివరాలు నమోదు చేయాలి.
వసతిగృహాల్లో ఉంటున్న వారితోపాటు సిబ్బంది ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలి.
అగ్నిప్రమాదాల నివారణ సామగ్రి ఉండాలి. తరచూ తనిఖీ చేయాలి.
ప్రథమ చికిత్స కిట్, నోటీస్ బోర్డు, సలహాలు/ఫిర్యాదుల పెట్టె తప్పనిసరి.
ప్రతి ఒక్కరికి లాకర్ సౌకర్యముండాలి.
మాస్కు లేకుండా లోపలికి అనుమతించకూడదు.
థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఆ వివరాల నమోదుకు ప్రత్యేక పుస్తకం, ప్రవేశ మార్గంలో శానిటైజర్/ సబ్బు అందుబాటులో ఉంచాలి.