కాల గమనంలో మరో ఏడాది గడిచిపోయింది. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన శ్రీ విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలికి... కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతుంది వికారి నామ సంవత్సరం. మామిడి పూతల సువాసనలతో, కోకిల సుమధుర గానాలతో స్వాగతం పలుకుతూ.. వచ్చేదే ఉగాది.
ఈ పండుగ పూట పచ్చదనంతో విరబూసిన పూలతో ప్రకృతి అందంగా ముస్తాబై కొత్త శోభను తెస్తోంది. ఈరోజు ఏ పని మొదలు పెట్టినా.. సంవత్సరమంతా ఆ పని బాగా సాగి మంచి ఫలితాలు వస్తాయన్నది జనాల నమ్మకం. నూతన వ్యాపారాల ప్రారంభం, కొత్త వస్తువుల కొనుగోలు తదితరాలన్నీ ఈ పర్వదినాన చేపడుతుంటారు.
ఈ పండుగనాడు శిశిర రుతువు పోయి చైత్రమాసంలో వసంత రుతువు ఆరంభమవుతుంది. ప్రకృతితో పాటు మానవ శరీరంలోనూ మార్పులు చోటుచేసుకునే కాలమిది. వసంత రుతువు నవచైతన్యానికి నాంది. చిగురించిన చెట్లతో ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. ఈ వాతావరణం మనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉగాది పండుగలో ఆరోగ్య విజ్ఞానం దాగి ఉంది. అందుకే ఇది ప్రకృతి పండుగ.
తెలుగు వారి లోగిల్లు మామిడి తోరణాలతో ముస్తాబవుతాయి. పిండివంటలతో ఘుమఘుమలాడుతాయి. కుటుంబ సభ్యులంతా కలిసి సమష్టిగా భోజనాలు చేయడం పండగపూట ప్రత్యేకత. బెల్లం, చింతపండు, వేప పువ్వు, మిరియాలు, మామిడితో కలిపి చేసే ఉగాది పచ్చడి కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఇళ్లలోనే కాక అన్ని కార్యాలయాల్లో పచ్చడి చేసి పంచుతుంటారు. ఇక మరో ప్రత్యేకమైన వంటకం భక్ష్యాలు.
ఈ ఉగాదికి ప్రకృతిని ఆస్వాదిస్తూ... మనలో కొత్త ఉత్సహాన్ని నింపుకుంటూ... జీవితాన్ని సంతోషంగా గడుపుదాం! ఈటీవీ భారత్ వీక్షకులకు శ్రీవికారి నామ సంవత్సర శుభాకాంక్షలు...
ఇవీ చూడండి: అకాల వర్షంతో అన్నదాతకు కన్నీరు