సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏయే శాఖల కార్యాలయాలను ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దస్త్రాల తరలింపులో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు సచివాలయ కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానుంది. అనంతరం బీఆర్కే భవన్‌ను స్వాధీనం చేసుకొని, అవసరమైన మార్పులు చేయనున్నారు. ఒకటి, రెండు శాఖలు మినహా అన్నింటిని బీఆర్కే భవన్‌కే తరలించనున్నారు. తొమ్మిది అంతస్తులున్న ఈ భవనంలో ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉంది.. ఏయే శాఖలను సర్దుబాటు చేయవచ్చన్న విషయమై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తరలింపుపై మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు సీఎస్ ఎస్కే జోషి సమీక్షించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
తరలింపునకు సిద్ధం కావాలని ఆయా శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కీలకమైన దస్త్రాల తరలింపులో ఇబ్బందులు తలెత్తకుండా కీలకమైన వాటిని స్కానింగ్ చేసి భద్రపరుస్తున్నారు. కార్యాలయాల్లోని సామగ్రి, దస్త్రాలను తరలించేందుకు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. రవాణా శాఖ ద్వారా ఎంపిక చేసి ఆయా శాఖలను కేటాయించారు.
బీఆర్కే భవన్ సరిపోకపోతే పక్కనే ఉన్న ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయ ప్రాంగణంలో ఉన్న బ్యాంకులు. తపాలా కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి వాటిని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సర్దుబాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇవీ చూడండి: రేపు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ భేటీ