రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్ జిల్లాల్లో వాన బీభత్సం సృష్టించింది.
నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో కురిసిన గాలివానకి ధాన్యం తడిసి ముద్దైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వీచిన ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సూర్యాపేట జిల్లాలో పడిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. ఇళ్లలోని సామగ్రి నీటిపాలై బాధిత కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామం వద్ద గల ఈసీ వాగు మూడేళ్ల తరువాత కొత్త నీటితో పారుతూ అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం పెరిగి రైతులకు నీటి కొరత తీరే అవకాశం కనిపించింది.
ఖమ్మం జిల్లాలో గాలి దుమారంతో ఓ మోస్తరు వర్షం కురిసింది. చింతకాని మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెలకాపరులు స్పృహ తప్పి పడిపోయారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ధాటికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. వేగంగా వీచిన గాలులకు వ్యాపార సముదాయాల ముందున్న రేకులు ఎగిరిపోయాయి.