1952 - 2014 వరకు
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ‌్గా, కాంగ్రెస్ 11 సార్లు, తెదేపా 3సార్లు, తెరాస, స్వతంత్ర అభ్యర్థులు చెరోసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ప్రస్తుతం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 1991 వరకు కాంగ్రెస్ హవా కొనసాగింది. తర్వాత 3 పర్యాయాలు తెదేపాగెలుపొందింది. 2004 , 2009లో మళ్లీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. వరుసగా రెండుసార్లు మధుయాస్కీ గెలుపొందారు. 2014లో కాంగ్రెస్, తెదేపాలకు తెరాస బ్రేకులేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తొలిసారిగా పోటి చేసి గులాబీ జెండా ఎగరేశారు.
కవిత టార్గెట్ 4లక్షల మెజార్టీ
15లక్షల 53వేల ఓటర్లు ఉన్న ఈ లోక్‌సభ పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ గ్రామీణం, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల శాసనసభ సెగ్మెంట్లను గెలుచుకొని గులాబీ దళం ఉత్సాహంగా కనిపిస్తోంది. తెరాస సిట్టింగ్ ఎంపీ కవిత రెండోసారి బరిలో ఉన్నారు. గతసారి లక్షా 67 వేల ఓట్ల మెజారిటీరాగా, ఈసారి 4 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు. అయితే కేంద్రం నుంచి పసుపు బోర్డు తీసుకొస్తానన్న హామీ నిలబెట్టుకోలేదన్న విమర్శ వినిపిస్తోంది. నిజాం చక్కెర పరిశ్రమను తెరిపించలేకపోయారన్న ఆరోపణ ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నామపత్రాలు దాఖలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యాస్కీ
కాంగ్రెస్ నుంచి వరుసగా మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచిన మధుయాస్కీ..మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి నుంచి పోటీకి విముఖత చూపినా అధిష్ఠానం మధుయాస్కీ పేరే ఖరారు చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. పార్టీ నేతలు నిరుత్సాహంగానే ఉన్నా..కింది స్థాయిలో క్యాడర్ బలంగా ఉండటం కలిసొచ్చే అంశం. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉంటూ పేరు తెచ్చుకున్నారు. అయితే ఓటమి తర్వాత పట్టించుకోలేదని అపవాదు మూటగట్టుకున్నారాయన.
అర్వింద్ పోటీనిస్తారా..?
భాజపా నుంచి డీఎస్ కొడుకు ధర్మపురి అర్వింద్ పోటీలో ఉన్నారు. జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో డైరెక్ట్ లింకుతో రాష్ట్ర భాజపా నేతలతో సంబంధం లేకుండా టికెట్ తెచ్చుకున్నారు. రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ..కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అర్వింద్.. గట్టి పోటీ ఇస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. యువతలో మంచి పట్టు ఉండటం, బీసీలు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజక వర్గంలో ఉండటంతో అర్వింద్ కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే తండ్రి, సోదరుడు ఇతర పార్టీలో కొనసాగుతుండటం. వీరి మద్దతుదారులు సహకరించే వీలులేకపోవడం పెద్ద మైనస్. అర్వింద్ మాత్రం ఎవరి రాజకీయం వాళ్లదని చెబుతున్నారు.
ఇదీ చదవండి:భువనగిరి కోటపై ఎవరి జెండా..?