ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. ఏకపక్షంగా కొనసాగిన ఓటింగ్‌లో ఎంఐఎం అభ్యర్థితో సహా ఐదు స్థానాలు గెల్చుకుని విజయఢంకా మోగించింది. ప్రత్యర్థుల ఎత్తులు చిత్తుచేసి గులాబీ జెండా ఎగరేసింది. మొత్తం ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. అధికార పార్టీ నుంచి మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం నుంచి మీర్జా రియాజుల్ హసన్ , కాంగ్రెస్ నుంచి అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలను కాంగ్రెస్ బహిష్కరించడం, తెలుగుదేశం, భాజపా ఓటింగ్‌కు దూరంగా ఉండటంతో గెలుపు సునాయాసమైంది.
విజేతలకు అధినేత శుభాకాంక్షలు
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో 91మంది తెరాస సభ్యులు, ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. విజేతలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. గెలుపొందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాసకార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
ఫలించిన కేసీఆర్ వ్యూహాలు
పోలింగ్‌లో ఎలాంటి పొరబాట్లు జరగకుండా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చెల్లని ఓట్ల సమస్య తలెత్తకుండా నమూనా పోలింగ్ కూడా నిర్వహించారు. ఏ ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేయాలని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లి ఓటు వేసేలా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో క్వీన్ స్వీప్ చేయడంతో గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ 17కి 17స్థానాల్లో గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఉన్నారు.