ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభానికి అంతా సిద్ధమైంది. సచివాలయంలో "పీఎం - కిసాన్ సమ్మాన్ నిధి"పై వ్యవసాయ శాఖ ముఖ్య కారద్యర్శి సి.పార్థసారధి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి సన్నాహాలు చేశారు.
గోరఖ్‌పూర్‌లో ప్రారంభించనున్న మోదీ...
నేడు ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. సాగు సంక్షోభం నుంచి అన్నదాతను బయటపడేసేందుకు ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతుకు 6 వేల రూపాయల చొప్పున పంపిణీ కోసం సర్వం సన్నద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు, కలెక్టర్ల సహకారంతో ప్రతి జిల్లాలో కూడా పీఎం - కిసాన్ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. డివిజన్ స్థాయిలో కూడా జిల్లా, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధి పొందే రైతుల వివారాలను అధికారులు పోర్టల్‌లో పొందుపరిచారు.
ఏఈఓలు నిర్లక్ష్యం వహించరాదు.. పార్థసారథి
ఇంకా అర్హులైనప్పటికీ రైతు జాబితాలో అప్‌లోడ్ చేయని మిగతా రైతుల వివరాలు త్వరితగతిన సేకరించి పోర్టల్‌లో నిర్ణీత గడువు ఈ నెల 28వ తేదీ లోగా అప్‌లోడ్ చేయాని పార్థసారధి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అర్హుల పేర్లు అప్‌లోడ్ చేయడంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లు నిర్లక్ష్యం వహిస్తే క్షమించబోమని హెచ్చరించారు.
ప్రత్యక్ష ప్రసారం...
ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు పీఎం - కిసాన్ పథకం ఉద్దేశం, 11.00 నుంచి 11.30 వరకు మన్ కీ బాత్ కార్యక్రమం, 11.30 నుంచి 12.30 వరకు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ పథకం ప్రారంభాన్ని దూరదర్శన్, డీడీ-నేషనల్, డీడీ-కిసాన్ ఛానెల్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. రైతులందరూ ఈ కార్యక్రమం వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో పీఎం-కిసాన్ నిధి ప్రారంభోత్సవం చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేశారు. సంబంధిత కేవీకే పరిసర గ్రామాల నుంచి రైతులందరినీ ఆహ్వానించి పెద్ద పండుగ వాతావరణం నడుమ ప్రధాని మోదీ ప్రసంగం వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.