ప్రధానమంత్రి మోదీ రెండోమారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటి సారిగా ఈ నెల 15న నీతిఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు. 15వ తేదీ మధ్యాహ్నం దిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానం పంపగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ 14న దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో కొన్ని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ఆదేశాలు జారీ..
నీతిఆయోగ్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అంశాలకు సంబంధించిన సమాచారం పంపాలని అన్ని శాఖలు, విభాగాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి ఆదేశించారు. నీతిఆయోగ్ ఎజెండాలోని అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సమావేశంలో రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అటు హస్తిన పర్యటనలో ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఇవీ చూడండి: 'ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం కావాలి'