CHANDRA BABU
శుభకార్యమైనా, సందర్భం ఏదైనా దుస్తులు మాత్రం అవే. విదేశి పర్యటనకు వెళ్లినా... ఇతర రాష్ట్రాలను సందర్శించినా....వాతావరణం ఎంత సంక్లిష్టంగా ఉన్నా ఆయన డ్రస్కోడ్ను మార్చలేకపోయాయి. దావోస్ పర్యటన సందర్భంగా గడ్డకట్టే చలిలోనూ ఎప్పుడూ వేసుకునే బట్టలనే వేసుకున్నారు.
ఏళ్లతరబడి వేరే రంగు దుస్తులు వేయని చంద్రబాబు నాయుడు తొలిసారిగా విభిన్నంగా కనిపించారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన బంద్‌కు సంఘీభావం ప్రకటించిన సీఎం... తొలిసారిగా నల్లదుస్తుల్లో కనిపించారు. కేంద్ర నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ ఎప్పటికప్పుడు గళమెత్తే చంద్రబాబు... ప్రత్యేక హోదా బంద్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. బంద్‌కు వ్యతిరేకమైనా... రాష్ట్ర ప్రయోజనాల కోసం శాంతియుత పద్దతుల్లో ఆందోళనలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బంద్‌కు సంఘీభావం తెలిపేందుకు అంతా నల్లదుస్తులు, బ్యాడ్జీలతో రావాలని కోరారు. చెప్పడమే కాదు... తానూ నల్లదుస్తులు ధరించి శాసనసభకు వచ్చారు.
తొలిసారిగా చంద్రబాబును భిన్నమైన రంగు దుస్తుల్లో చూసిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ రాష్ట్రం కోసం శ్రమించే చంద్రబాబు... నమ్మించి మోసం చేసిన మోదీపై ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో ఇదే నిదర్శనమని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.