ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని... మొదటిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు వచ్చిన జగన్, ఆయన సతీమణి భారతిని... కారు దగ్గరకు వెళ్లి సీఎం కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. జగన్‌కు పుష్పగుచ్చం ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. 151 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసినందుకు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పోచంపల్లి ఇక్కత్ శాలువా కప్పి..కరీంనగర్ పిలిగ్రీ జ్ఞాపిక బహుకరించి సత్కరించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మంత్రులు, సభాపతి, ఉపసభాపతి జగన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలను కేసీఆర్-జగన్ పరస్పరం పరిచయం చేసుకున్న తర్వాత దాదాపు గంట సేపు సమావేశం జరిగింది. ఈ నెల 30న జరగనున్న ప్రమాణస్వీకార మహోత్సానికి హాజరు కావాల్సిందిగా జగన్ కేసీఆర్‌ను కోరగా... అందుకు అంగీకరించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఇప్పటికే కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు సమాచారం.
రాష్ట్రాల సంబంధాలపై చర్చ...
రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని, కేంద్రంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల్లో కలిసి పనిచేయాలనే దానిపై ప్రాథమికంగా చర్చ జరిగినట్లు తెరాస వర్గాలు తెలిపాయి. గోదావరి నది నుంచి తెలంగాణ గరిష్ఠంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదని... ప్రతీ ఏటా సుమారు 3వేల 500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజి ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించి.. ఆ నీరంతా ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుందన్నారు. కేవలం రెండు లిఫ్టులతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చునన్నారు. త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని కేసీఆర్, జగన్ నిర్ణయించారు. నీటి వివాదాలు పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ప్రడ్నవీస్ కూడా సహకరిస్తామన్నట్లు గుర్తుచేసుకున్నారు.
గవర్నర్‌తో భేటీ...
అంతకుముందు రాజ్‌భవన్‌లో జగన్ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. జగన్ వెంట ఆయన భార్య భారతి, వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారు. తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నట్లు బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైకాపా నేతల బృందం గవర్నర్‌కు తీర్మాన ప్రతిని అందించింది. జగన్‌ను అభినందించిన గవర్నర్... రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సుపరిపాలన అందించాలని గవర్నర్ సూచించారు. వీరి మధ్య దాదాపు గంటకుపైగా సమావేశం జరిగింది. ఈ నెల 30న మధ్యాహ్నం 12గంటల 23 నిమిషాలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు... రాజ్‌భవన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఘనస్వాగతం...
గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో జగన్ సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఆయన కారు దిగి చేయి ఊపుతూ పలుకరించారు. ఈ సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: కేసీఆర్‌తో జగన్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం