హైదరాబాద్ ఓవైసీ కుటుంబానిదే
హైదరాబాద్ పాతనగరంలో ఆల్ ఇండియా ఇతైహదుల్ ముస్లిమీన్ గత కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో 1984 నుంచి ఓవైసీ కుటుంబమే గెలుస్తోంది. సలావుద్దీన్ ఓవైసీ 1984లో స్వతంత్ర అభ్యర్థిగా, 1989 నుంచి 1999 వరకు ఎంఐఎం తరుఫున వరుసగా ఐదుసార్లు గెలిచారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు అసదుద్దీన్ ఓవైసీ గెలిచి హాట్రిక్ సాధించారు. మరోసారి లోక్‌సభ బరిలో నిలిచేందుకు అసద్ సిద్ధమవుతున్నారు.
తెరాసతోనే...
గతంలో ఎంఐఎం, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలకు వేళ్లేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత... మజ్లిస్, తెరాస మధ్య మైత్రి బలపడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తెరాస అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఎంఐఎంతో స్నేహపూర్వక పోటీ చేసింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ... పట్టున్న ఏడు స్థానాలతోపాటు రాజేంద్రనగర్‌లో మాత్రమే అభ్యర్థిని నిలిపి మిగతా చోట్ల 'కారుకే మా మద్దతు' అని బహిరంగంగానే ప్రకటించింది.
పక్క రాష్ట్రాల్లోనూ పోటీ
లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే మైత్రిని కొనసాగిస్తూ... 16 చోట్ల తెరాస, హైదరాబాద్‌లో ఎంఐఎం పోటీ చేయబోతున్నాయి. తెరాసకు 16, మజ్లిస్‌కు ఒక స్థానం అంటూ ఇరుపార్టీల నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కేసీఆర్ చెప్తోన్న కాంగ్రెస్, భాజపాయేతర సమాఖ్య కూటమికి ఎంఐఎం జై కొట్టింది. ఇతర రాష్ట్రాల్లోనూ అభ్యర్థులను నిలిపే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే బిహార్ కిషన్ గంజ్ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్‌ను ప్రకటించింది. మహారాష్ట్ర ఔరంగాబాద్, ఉత్తర్ ప్రదేశ్‌లోనూ పోటీ చేసేందుకు మజ్లిస్ కసరత్తు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి కోరితే ఆంధ్రప్రదేశ్‌లో వైకాపాకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధమేనని గతంలో అసద్ ప్రకటించారు.
ఈసారి అసద్‌పై కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే యోచనలో ఉంది. మరి ఎంఐఎం ఏ రకమైన వ్యూహ రచన చేస్తుందన్నది వేచి చూడాలి.