హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఖాళీ భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ... గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా ప్రభుత్వ భవనాలు కేటాయించారు. ఏపీ పాలన పూర్తిగా అమరావతి నుంచే నడుస్తున్నందున భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాడుకలో లేనప్పటికీ... ఏపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, ఇతర పన్నులు చెల్లిస్తోంది. ఉపయోగంలో లేనందున భవనాలు పాడవుతున్నాయని... వాటిని తమకు కేటాయించాలని తెలంగాణ మంత్రివర్గం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఏపీకి చెందిన భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి ఒకటి, ఇతర కార్యాలయాల నిర్వహణకు మరొకటి కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ భవనాలకు సంబంధించిన ఆస్తి పన్ను సహా ఇతర బకాయిలన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
హర్షం వ్యక్తం చేసిన కేసీఆర్
హైదరాబాద్లోని ఏపీ భవనాలు తెలంగాణకు కేటాయించటం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్య వ్యక్తం చేశారు. ఖాళీగా ఉండే బదులు ఉపయోగంలోకి తేవడం ఉత్తమం అన్నారు. రెండు రాష్ట్రాలు స్నేహభావంతో ముందడుగు వేయడం మంచి పరిణామం అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పనిచేయాలన్నదే తన ఆకాంక్షగా చెప్పారు. అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యంతో పరిష్కారం కావాలన్నారు.
ఇవీ చూడండి: 'మత సామరస్యంలో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శం'