పార్లమెంట్‌తో పోల్చితే అసెంబ్లీ భవనమే అద్భుతంగా ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయాన్ని కూల్చి కొత్త అసెంబ్లీ భవనాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావడంలేదని ఆక్షేపించారు. ఇలా చేయడం ప్రజాధనం దుర్వినియోగమవుతుందని... ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
వివేక్ వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హయత్ ప్యాలెస్ హోటల్‌లో 'సచివాలయం కూల్చివేత - కొత్త అసెంబ్లీ నిర్మాణం' అంశంపై అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చరిత్రాత్మక కట్టడాలను కూల్చవద్దంటూ అన్ని పార్టీలు ముక్తకంఠంతో పేర్కొన్నాయి. కేసీఆర్ ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టి అనవసరమైన అంశాల పట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. వ్యక్తులెవరైనా పదవి చేపట్టిన తర్వాత రాజ్యాంగబద్ధులై ఉండాలన్నారు. సెక్రటేరియట్ భవనం నిర్మించాలన్నా, కూల్చాలన్నా రాజ్యాంగం ప్రకారమే వెళ్లాలన్నారు. తుగ్లక్ మాదిరిగా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ దుయ్యబట్టారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెదేపా నేత ఎల్ రమణ, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, భాజపా నేతలు ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, పర్యావరణవేత్త అనురాధ రెడ్డి, పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పటిష్ఠమైన చట్టాలతోనే మెరుగైన సేవలు: కేసీఆర్