TSRTC Badradri Thalambralu Home Delivery : భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను హోమ్ డెలివరీ చేయడానికి టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. స్వామివారి తలంబ్రాలను కేవలం కల్యాణ మహోత్సవ సమయంలోనే కాకుండా భక్తులు ఎప్పుడు కావాలన్నా పొందే విధంగా టీఎస్ ఆర్టీసీ అవకాశాన్ని కల్పించింది. కల్యాణ తలంబ్రాలను భక్తులకు చేర్చడం కోసం టీఎస్ఆర్టీసీ చేపట్టిన ఈ పనికి భక్తుల నుంచి భారీ స్పందనే లభిస్తుంది. చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో తలంబ్రాల కోసం బుకింగ్‌లు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్టీసీకి భారీగానే బుకింగ్‌లు నమోదవుతున్నాయి.
భక్తుల నుంచి అనూహ్య స్పందన: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించే కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ చేపట్టింది. అందుకోసం ప్రత్యేక అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ ఈ అవకాశం ప్రవేశపెట్టిన కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయని ఆర్టీసీ వెల్లడించింది. రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే కల్యాణం అనంతరం తలంబ్రాలను భక్తులకు ఆర్టీసీ హోమ్ డెలివరీ చేయనుంది.
ఎప్పుడైనా తలంబ్రాలను పొందవచ్చు: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తలంబ్రాల బుకింగ్ జరుగుతోంది. భక్తులకు మరో అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కార్గో పార్సిల్ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందించాలని నిర్ణయించింది.
విదేశాల నుంచీ మంచి ఆదరణ: భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోందని ఆర్టీసీ చెబుతుంది. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచీ బుకింగ్‌లు వస్తున్నాయని.. దుబాయ్, అమెరికా తదితర దేశాల నుంచి కాల్ చేసి తలంబ్రాలు కావాలని అడుగుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్సిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని యాజమాన్యం సూచించింది. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020లలో సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌లను స్వీకరిస్తారని ఆర్టీసీ వెల్లడించింది.
ఇవీ చదవండి: