Bhadrachalam Elections: భద్రాచలం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో.. నాలుగు వారాల్లో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీపీఎం నేత ఎస్.వీరయ్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.
భద్రాచలం పంచాయతీని గిరిజన చట్టాలకు విరుద్ధంగా మున్సిపాలిటీ చేశారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధ నాగరాజ్ వాదించారు. భద్రాచలానికి పంచాయతీ ఎన్నికలు జరిపేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. భద్రాచలం ఎన్నికలు ఆపాలని గతంలో ప్రభుత్వం కోరిందని.. రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. భద్రాచలం పంచాయతా? మున్సిపాలిటా? అనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఎస్ఈసీ పేర్కొంది. పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందనలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. గడువు ముగిసి ఐదేళ్లు గడిచినా ఎన్నికల నిర్వహించకపోవడంపై ఆశ్యర్యం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని.. లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.