భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులు పొందేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈనెల 2వ తేదీన జరిగిన సీతారాముల కల్యాణానికి లాక్డౌన్ కారణంగా భక్తులెవరినీ అనుమతించని నేపథ్యంలో.. రాష్ట్రంతో పాటు.. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని దేవాదాయశాఖ ప్రకటించింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న 'టీ ఆప్ ఫోలియో' ద్వారా తలంబ్రాల ప్యాకెట్‌ను బుక్ చేసుకుంటే.. వారి ఇళ్ల వద్దకే డెలివరీ పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. కుటుంబానికి రెండు చొప్పున ప్యాకెట్లు బుక్ చేసుకోవచ్చని.. ఒక్కో ప్యాకెట్ ధర రూ. 20గా రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది.
ఇప్పటికే పదివేల మంది భక్తలు తలంబ్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని.. వారికి మూడు రోజుల్లో తలంబ్రాల ప్యాకెట్లను అందిస్తామని దేవాదాయ కమిషనర్ తెలిపారు. ప్యాకెట్ ఖర్చు పోగా డెలివరీ ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుందని పేర్కొనింది.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఉన్నా జల్లికట్టు ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు