గోదావరి దిగువ ప్రాంతమైన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో నిర్మించిన పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్... ఎగువ ప్రాంతాలకు విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ నీరు భద్రాచలం దిగువన ఉన్న కొన్ని గ్రామాలకు ఇప్పటికే వచ్చి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు పట్టణం వరకూ వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద నీటిలోనే...
భద్రాచలంలో కిందటి ఏడాది ఆగస్టు నెలలో గోదావరి వరద 61.6 అడుగుల వరకు వచ్చింది. దీంతో చాలా కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. భద్రాద్రి రామయ్య ఆలయం పడమర మెట్ల వరకు నీరు వచ్చి చేరింది. 1986 వ సంవత్సరంలో మాత్రం వరద 75.6 అడుగుల వరకూ వచ్చింది. ఆ ఏడాది పట్టణంలోని సగ భాగం వరద నీటిలో మునిగింది.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు...
బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురయ్యే గోదావరి ఒడ్డున గల చాలా గ్రామాల ప్రజలను ఇప్పటికే... అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలోని వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలోని బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంలో వరద ఉద్ధృతి అధిక స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి పట్టణం చుట్టూ ఏర్పాటు చేసిన కరకట్టను ఎత్తు పెంచాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి