భద్రాచలంలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తోన్న వరదతో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి 42 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... ఇవాల్టి ఉదయానికి 43 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 48 అడుగులకు పెరగడం వల్ల అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు ఈ నీటిమట్టం ఏకంగా 50 అడుగులకు చేరింది. స్నానఘట్టాలు, కల్యాణకట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద రహదారిపైకి వరదనీరు భారీగా చేరుతోంది.
నీటిమట్టం 55 అడుగులకు పెరిగే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేటీఆర్