ఇల్లందు పట్టణంలో 30 పడకల ప్రభుత్వ ఆస్పపత్రి ఉంది. ఈ ఆస్పత్రికి ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని 5 మండలాలతో పాటు పినపాక నియోజకవర్గం నుంచి గుండాల, అల్లపల్లి మండలాల ప్రజలతో.. నిత్యం 300మంది ఓ.పి. రోగులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇలాంటి ఆస్పత్రిలో కొన్ని రోజులుగా వైద్యసేవలు లేక రోగులు నరకం అనుభవిస్తున్నారు.
పలు విభాగాలలో ఖాళీలు..
ఆస్పత్రిలోని నోటీసు బోర్డులలో పేర్లతో పాటు.. పలు విభాగలలో ఉన్న ఖాళీలను కూడా ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ ఆస్పత్రిలో పర్యటించినప్పటికి హామీలు ఇచ్చారు తప్ప.. వాటిని పరిష్కరించలేదని వైద్యులు, రోగులు చెబుతున్నారు. సౌకర్యాలు మెరుగు పరిచి.. అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మిగిలాయి.
అత్యవసర వైద్యసేవలు లభించక రోగుల ఇబ్బందులు
ముఖ్యంగా వాచ్ మెన్ కొరత, పలు విభాగాల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని డాక్టర్ వరుణ్ తెలిపారు. అత్యవసర వైద్యసేవలు లభించక రోగులను ఖమ్మం తరలించే పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణ క్రమంలోనే పలువురు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయని వెల్లడించారు. 30 పడకల ఆసుపత్రిని పూర్తిస్థాయి సౌకర్యాలతో ఆధునీకరించాలని ఇల్లందు నియోజక వర్గ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏజన్సీ ప్రాంతం కావడం.. పేదలు, ఆదివాసీ గిరిజనులు అధికంగా వచ్చే ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: పండించిన పంటలకు.. రైతే మద్దతు ధర నిర్ణయించాలి..