భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండేళ్ల నుంచి పనులు చేస్తున్నప్పటికీ పట్టణంలోని చాలా కాలనీల్లో పైపులైను పనులు కూడా పూర్తి కాలేదు. మరికొన్ని ప్రాంతాల్లో పైపులైన్లు వేసినప్పటికీ తాగు నీరురావడం లేదు. ఇలా భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలలో మిషన్ భగీరథ పనుల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
తాగునీటిలో కలుస్తున్న మురుగునీరు
ప్రతి సంవత్సరం వేసవి కాలంలో భద్రాచలం వాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. స్థానికంగా అందించే తాగునీటి పైపుల్లో అనేక చోట్ల లీకులు ఏర్పడి ప్రతిరోజు వేలాది లీటర్ల నీరు మురుగు కాలువల్లోకి వెళ్తోంది. మరికొన్ని చోట్ల మురుగునీరు తాగునీటితో కలిసి వస్తుండటం వల్ల.. పలుచోట్ల వ్యాధులు విజృంభిస్తున్నాయి.
కాలనీవాసుల ఆందోళన
మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. కాలనీవాసులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి అన్ని కాలనీలకు తాగునీరు అందించాలని కోరుతున్నారు. ఈసమస్య నుంచి ప్రజలను గట్టెక్కించి పనులు తొందరగా పూర్తి చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు