ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు ఏడాదిన్నర తర్వాత ప్రభుత్వ విద్య కోసం పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులకు అనేక సమస్యలు(Problems in govt school) స్వాగతం పలుకుతున్నాయి. కొవిడ్ విజృంభనతో పాఠశాలలు మూతపడగా... సెప్టెంబర్ 1 నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1,256 ఉన్నాయి. వీటిలో మొత్తం 89,297 విద్యార్థులు చదువుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మొత్తం 1064 ప్రభుత్వ పాఠశాలల్లో 49,653 మంది విద్యార్థులు ఉన్నారు. కొవిడ్(covid) భయంతో ఇంకా విద్యార్థుల హాజరు సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వ బడుల్లో అనేక సమస్యలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి.
తప్పని తిప్పలు
అనేక పాఠశాలల్లో పారిశుద్ధ్య సమస్య ఇబ్బందికరంగా మారింది. ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. ఏదాదిన్నరగా నిర్వహణ లేక పాఠశాలల్లో తరగతి గదులు, భవనాలు, పరిసరాల్లో పారిశుద్ధ్యలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరమ్మతులు చేయక కొన్నిచోట్ల, వినియోగంలో లేక పిచ్చిమొక్కలతో ఇంకొన్ని చోట్ల, కూలిపోయే దశలో ఉన్నవి మరికొన్ని చోట్ల ఇలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా మహమ్మారికి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లు(శుభ్రం చేయువారు) అందుబాటులో ఉండేవారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి వేతనాలు ప్రభుత్వం చెల్లించేది. ఆ తర్వాత కరోనా కాలంలో వారిని ప్రభుత్వం తొలగించింది. ఈ పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
స్కావెంజర్ల తొలగింపు తర్వాత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను స్థానిక సంస్థలు, పురపాలికలు, నగరపాలికలకు అప్పగించారు. గ్రామీణ, మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో పురపాలికలకు పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. శౌచాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రహారి గోడ లేక బయటి వ్యక్తులు పాఠశాలలోని మరుగుదొడ్లను వాడుతున్నారు. లాక్‌డౌన్(lock down) కారణంగా ఈ సమస్య మరీ ఎక్కువైంది. పారిశుద్ధ్య విభాగం-విద్యాశాఖ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. వెంటనే స్కావెంజర్లను నియమించాలని కోరుతున్నాం. లేదంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
-ప్రధానోపాధ్యాయులు
ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్య సమస్యలతో సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభించే అవకాశాలు ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో పాఠాలు వినే విద్యార్థులు, చదువులు చెప్పే ఉపాధ్యాయులు, సిబ్బందికి వ్యాధుల ముప్పు పొంచి ఉంది. గ్రామ, మండల స్థాయిలో విద్యాశాఖ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పని చేస్తేనే కొంత వరకు సమస్యలు అధిగమించే అవకాశం ఉంది. మళ్లీ స్కావెంజర్లను నియమిస్తేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తొలగిపోతాయి. స్థానిక సంస్థల సిబ్బందితోనైనా పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా పనిచేయిస్తేనే కొంత మార్పు కనిపిస్తుంది. లేకపోతే టీచర్లకు, పిల్లలకు ఈ తప్పలు తప్పవని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: Women services for handicapped: కుమారుని కోసం ఉద్యోగాన్ని వదిలేసి.. అభాగ్యుల పాలిట అమ్మగా మారింది!